iDreamPost
iDreamPost
మొన్నటి ఎన్నికల సమయంలో రాష్ట్రంలో హొరెత్తించిన ’బైబై బాబు’ నినాదం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని అంటూ సోదరి షర్మిల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డుషోలు నిర్వహించింది. ఆ సమయంలో షర్మిల ఇచ్చిన బైబై బాబు స్టోగన్ జనాలను బాగా అకట్టుకుంది. జనాల్లోకి విపరీతంగా చొచ్చుకుపోయింది. ఒకవైపు జగన్ పర్యటనలు, బహిరంగసభలు మరో వైపు షర్మిల రోడ్డుషోలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. దాని ఫలితం ఎలా వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
సీన్ కట్ చేస్తే ఏడాది పాలన సందర్భంగా మళ్ళీ అదే నినాదం షర్మిల ఇచ్చిన బైబై బాబు స్లోగన్ అంతే ట్రెండ్ సృష్టించింది. 22వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 23వ తేదీ సాయంత్రం 6 గంటలు అంటే 24 గంటల్లో ట్విట్టర్ వేదికగా రెండు అంశాలు సంచలనంగా మారింది. మొదటిదేమో # వన్ ఇయర్ ఫర్ వైఎస్ఆర్సిపి మాసివ్ విక్టరీ అయితే రెండో అంశం # వన్ ఇయర్ ఆఫ్ బైబై బాబు.
మామూలుగా అయితే వైసిపి ఘనవిజయం గురించి జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం గురించి సోషల్ మీడియాలో పోస్టులు మారు మోగిపోతుందని అందరూ ఊహించిందే. అయితే వైసిపి విజయంతో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా షర్మిల ఇచ్చిన బైబై బాబు నినాదం కూడా ఈ స్ధాయిలో మారుమోగిపోతుందని ఎవరు ఊహించలేదు. మొత్తానికి సోషల్ మీడియాలో మెజారిటి వేదికలు జగన్ సాధించిన అఖండ విజయానికి సమానంగా చంద్రబాబు ఘోరపరాజయాన్ని కూడా హైలైట్ చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంది. దీన్ని బట్టి అర్ధమవుతున్నదేమంటే చంద్రబాబు పై జనాల్లో ఇంకా మంటగానే ఉన్నట్లు.
ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా టిడిపి వ్యవహరించటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తన హుందాతనాన్ని కోల్పోయి ప్రతి చిన్న విషయాన్ని జగన్ కు ముడేసి బురద చల్లేస్తున్న విషయాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన హయాంలో అన్న విధాలుగా విఫలమైన చంద్రబాబు ఇపుడు జగన్ పాలనలో ప్రతి అంశాన్ని తప్పుపడుతుండటంపై మెజారిటి జనాలు మండిపోతున్నారు. ఆ మంటే సోషల్ మీడియాలోను ప్రత్యేకించి ట్విట్టర్ వేదికలో ప్రతిఫలించిందనే అనుకోవాలి.