iDreamPost
iDreamPost
మాములుగా ఏదైనా సూపర్ మార్కెట్ లో వస్తువుల స్టాక్ ఎక్కువగా మిగిలిపోతే ఆఫర్ల పేరిట డిస్కౌంట్లు ఇవ్వడమో లేదా ఒకటి కొంటే మరొకటి ఉచితమని ప్రకటించడమో చేస్తుంటారు. అలాంటివి ఒకరకంగా డెడ్ స్టాక్ లాంటివి. అంటే డిమాండ్ లేని వాటిని ఈరకంగా అంటగట్టే ప్రయత్నం చేస్తారన్న మాట. ఇప్పుడీ ట్రెండ్ సినిమాలకూ వస్తోంది. గత వారం విడుదలై దారుణమైన టాక్ తో డిజాస్టర్ గా మిగిలిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చే దిశగా వెళ్తోంది.
ఇప్పటికే చాలా చోట్ల ఫైనల్ రన్ కు రావడం, భీష్మ పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం లాంటి కారణాలు ప్రపంచ ప్రేమికుడిని బాగా దెబ్బ తీశాయి. కాకపోతే ముందే చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొందరు ఎగ్జిబిటర్లు ఇంకా రన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎంతో కొంత సొమ్ము రాబట్టుకునేందుకు కొత్త ప్లాన్లు వేస్తున్నారు. అందులో భాగంగా జరిగిందే ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ పిక్ నెల్లూరు జిల్లాలోని ఓ థియేటర్ బయట తీసినట్టుగా తెలిసింది. ఒక టికెట్ కొంటె మరొక టికెట్ ఫ్రీ. అంటే ఒకే ధరపై ఇద్దరు సినిమా చూడచ్చన్న మాట. ఇలా చేస్తే నష్టం వస్తుంది కదానే డౌట్ రావొచ్చు. కానీ అసలెవరు రాకుండా ఉండటం కంటే ఇలాంటి వాటికి టెంప్ట్ అయిపోయి వచ్చే ఐదో పదో టికెట్ సొమ్ములు కనీసం మెయింటెనెన్స్ కోసమైనా పనికొస్తాయి కదా.
ఇలాంటి ప్రాక్టీస్ సాధారణంగా ఓవర్సీస్ లో ఉంటుంది. అటుఇటు అయిన సినిమాలకు ఇలా ప్రకటనలు ఇస్తుంటారు. అక్కడ టికెట్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతోకొంత రెస్పాన్స్ ఉంటుంది. కానీ మనదగ్గర బాక్స్ ఆఫీస్ దగ్గర తిరస్కరణకు గురైన సినిమాను ఇలా ఎన్ని ఆఫర్లు పెట్టినా జనం ఎగబడతారా. ఏదో గుడ్డిలో మెల్ల తరహాలో ఇది వాళ్ళకు ఎంతో కొంత కలెక్షన్లు తెస్తే అదో ఊరట అని సర్దుకోవచ్చు. నలుగురు హీరోయిన్లు, క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్, ప్రతిష్టాత్మక బ్యానర్, హీరో ఇమేజ్ ఇవేవి వరల్డ్ ఫేమస్ లవర్ ని కొంతైనా కాపాడలేకపోయాయి.