iDreamPost
iDreamPost
ఎల్లుండి విడుదల కాబోతున్న కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు కొత్త ఉత్సాహం వస్తుందని ట్రేడ్ ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తోంది. అవతార్ 2 దూకుడు వారంకి మించి ఉండే సూచనలు లేకపోవడంతో ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి. ముందు ధమాకా సంగతి చూస్తే థియేట్రికల్ బిజినెస్ ని సుమారు 18 కోట్ల 40 లక్షలకు డీల్ చేసినట్టు తెలిసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 19 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంటుంది. ఆపై వచ్చేవి లాభాల కిందకు వస్తాయి. గత చిత్రం రామారావు ఆన్ డ్యూటీ కంటే ఇది తక్కువే అయినప్పటికీ డిస్కో రాజా, ఖిలాడీ లాంటి డిజాస్టర్లు ఇంతకన్నా ఎక్కువ చేశాయి. దీన్ని బట్టి ఫ్లాపుల ప్రభావం మాస్ రాజా మార్కెట్ మీద ఉందని తెలుస్తోంది
నిఖిల్ 18 పేజెస్ విషయానికి వస్తే థియేటర్ హక్కులు 12 కోట్లకు అమ్మారు. దీనిపైన అదనంగా ఓ 50 లక్షలు వస్తే సేఫ్ అయిపోతుంది. డిజిటల్ డబ్బింగ్ శాటిలైట్ లో దీనికి మంచి రేట్ పలికింది. కార్తికేయ 2 ప్రభావం వల్ల ఆశించిన దానికన్నా గీత ఆర్ట్స్ ఎక్కువ సొమ్ముని రాబట్టుకోగలిగింది. కాకపోతే అధిక ఏరియాలలో స్వంతంగా రిలీజ్ చేస్తుండటంతో బయ్యర్లకు ఎగ్జిబిటర్లకు ఎలాంటి రిస్క్ ఉండబోవడం లేదు. ఇక నయనతార కనెక్ట్ జరిగిన బిజినెస్ కోటిన్నర లోపే ఉండొచ్చని టాక్. లాఠీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎంత ఉన్నా మహా అయితే నాలుగు లేదా అయిదు కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ మౌత్ టాక్ మీద ఆధారపడుతున్నవే
ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత స్పీడ్ గా లేవు. చాలా చోట్ల సోసోగానే కనిపిస్తున్నాయి. రవితేజ మూవీకి సైతం ఇదే రెస్పాన్స్ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే నెలాఖరుకు చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ లేకపోవడం వీటికి కలిసొచ్చేలా ఉంది. ఏది హిట్ టాక్ తెచ్చుకున్నా కనీసం రెండు వారాల స్ట్రాంగ్ రన్ దక్కుతుంది. జనవరి 1 తర్వాత సంక్రాంతి పుంజులను దృష్టిలో ఉంచుకుని థియేటర్ల కొరత కారణంగా ఇంకెవరూ రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేరు. సో సరిగ్గా కంటెంట్ తో మెప్పిస్తే కనక చక్కగా వర్కౌట్ అవుతుంది. అవతార్ 2 ముందే చెప్పినట్టు నెమ్మదించేసింది కాబట్టి ఈ ఛాన్స్ ని కొత్త రిలీజులు ఎంతమేరకు వాడుకుంటాయో చూడాలి