Idream media
Idream media
రాజస్థాన్ రాజకీయం రంజుగా మారింది. న్యాయస్థానాలను కాదని, రాజకీయంగానే తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ అసెంబ్లీని సమావేశ పరచాలని మరోసారి మంత్రివర్గ తీర్మానంతో పంపిన లేఖను గవర్నర్ మళ్లీ తప్పి పంపడంతో రాజకీయ వేడి రగులుతోంది. నిన్న మొన్నటి వరకూ సీఎం అశోక్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్యన జరిగిన ఈ రాజకీయ క్రీడలోకి బీజేపీ ఎంటర్ అవగా.. తాజాగా బీఎస్పీ కూడా చేరింది. రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రతిపాలన పెట్టాలంటూ మాయావతి తాజాగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. కరోనా విపత్తులో ప్రజలు భయాందోళన మధ్య ఉంటే.. ప్రజల్లో ఉండాల్సిన ఎమ్మెల్యేల ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం అయ్యారని, సీఎం అశోక్ రాజ్‌భవన్ ముందు ధర్నా చేయడంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మాయావతి ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే రాజస్థాన్‌లో రాష్ట్ర పతి పాలన పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తూనే బీఎస్పీ.. రాజస్థాన్‌లో ఏ క్షణమైనా నంబర్ గేమ్ మొదలుకావచ్చనే అంచనాతో తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విశ్వాస పరీక్షతోపాటు ఏ విషయంలోనైనా సరే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్ర ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. బీఎస్పీ ఎంట్రీతో రాజస్థాన్ రాజకీయం కొత్త పుంతలు తొక్కబోతున్నట్లు తాజా పరిణామాల ద్వారా అర్థం అవుతోంది.
2019లో లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 200 సీట్లకు గాను కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 72 సీట్లకు పరిమతమైంది. ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు 24 మందితో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలు ముగిసిన ఐదు నెలలకు.. 2019 సెప్టెంబర్ 16న బీఎస్పీ తరఫున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 106కు చేరింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో మండవ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడంతో కాంగ్రెస్ బలం 107కు పెరిగింది. గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ బీఎస్పీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేశారు.
బీఎస్పీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో విలీనం అయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా.. తమది జాతీయ పార్టీ అని ఏ పార్టీలోనూ విలీనం కాలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్ర స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా పరిస్థితుల నేపథ్యంలో బీఎస్పీ ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. మరో వైపు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సమయంలో వారిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీజేపీ సుప్రిం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం నిన్న సోమవారం తోసిపుచ్చింది. ఇది జరిగిన మరుసటి రోజే బీఎస్పీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడంతో రాజస్థాన్ రాజకీయం సరికొత్త దిశగా పయనించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.