iDreamPost
android-app
ios-app

షాకింగ్ – కుటుంబం పోషణ కోసం కరోనా మృతదేహాలను మోస్తున్న బాలుడు

షాకింగ్ – కుటుంబం పోషణ కోసం కరోనా మృతదేహాలను మోస్తున్న బాలుడు

కరోనా వైరస్ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకమందిని వణికిస్తోంది. ఉపాధి రంగాలపై కరోనా వైరస్ ప్రభావం పడటంతో అనేకమంది ఉపాధి కోల్పోయారు. అలా ఉపాధి కోల్పోయిన కుటుంబాన్ని పోషించడానికి 17 ఏళ్ల బాలుడు చాంద్ మెహమ్మద్ తన కుటుంబం ఆకలి తీర్చటానికి ‘‘కరోనా’’వైరస్ సోకి చనిపోయినవారి మృతదేహాలను మోస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే చాంద్‌ కు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం చాంద్ అన్న ఓ దుకాణంలో అతి చిన్నపాటి పనిచేస్తున్నాడు. కాగా లాక్ డౌన్ కారణంగా చాంద్ మొహమ్మద్ అన్న ఉపాధి కోల్పోయాడు. దీంతో కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంటర్ చదివే చాంద్ మొహమ్మద్ ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబం ఆకలి తీర్చడానికి మెహమ్మద్ ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జై ప్రకాష్‌ నారాయణ్‌ ఆసుపత్రిలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వాళ్ళ మృతదేహాలను మోసే ఉద్యోగం చేస్తున్నాడు.

అయినవారికి, బంధువులకు కరోనా సోకితే తొంగి చూసే పరిస్థితి లేదు.. అలాంటిది కుటుంబ పోషణ కోసం కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలను బాలుడు మోయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడికి కరోనా ఎక్కడ సోకుతుందో అని చాంద్ మొహమ్మద్ అమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ ఇంత  ప్రమాదకరమైన ఈ ఉద్యోగానికి  తనకు కేవలం రూ.17 వేల జీతం మాత్రమే ఇస్తున్నారని తనకేమైనా జరిగితే కనీసం బీమా సౌకర్యం కూడా లేదని చాంద్ మెహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం చాంద్ మొహమ్మద్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పలువురు చాంద్ మొహమ్మద్ కుటుంబ పోషణ కోసం చేస్తున్న పనిని ప్రశంసిస్తున్నారు.