iDreamPost
android-app
ios-app

‘బుక్ మై షో’ అడ్డగోలు దోపిడీ.. అడ్డుకట్టకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం..

  • Published Jun 22, 2022 | 9:45 AM Updated Updated Jun 22, 2022 | 9:45 AM
‘బుక్ మై షో’ అడ్డగోలు దోపిడీ.. అడ్డుకట్టకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం..

ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు పెరిగి వినోదం తమకు దూరమైందని సామాన్య ప్రజలు బాధపడుతుంటే ఆన్లైన్ సినిమా టికెట్ల బుకింగ్ సంస్థ బుక్ మై షో అడ్డగోలు దోపిడీ చేస్తుంది. థియేటర్ కి వెళ్లి టికెట్ తీసుకోవడం కంటే ఆన్లైన్ లో తీసుకొని టైంకి వెళ్లొచ్చు అన్న జనాల మైండ్ సెట్ ని ఆసరాగా తీసుకొని బుక్ మై షో తెగ సంపాదించేస్తుంది. బుక్ మై షో చేస్తున్న ఈ దోపిడీకి థియేటర్ల యాజమాన్యాలు కూడా సపోర్ట్ ఇవ్వడం గమనార్హం. థియేటర్లతో కలిసి టికెట్ల ధరలపై అత్యధికంగా కమీషన్లు వసూలుచేస్తూ ‘బుక్‌ మై షో’ దోచుకుంటోంది.

దేశవ్యాప్తంగా ఈ మాఫియా జరుగుతుంది. అయితే దీనిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం.. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే టికెట్లు అమ్మాలని నిర్ణయించడంతో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు బుక్ మై షో ప్రయత్నిస్తుంది. థియేటర్లకు డిపాజిట్ల రూపంలో ముందే డబ్బులిచ్చి తమ సంస్థ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలనే షరతుతో ఒప్పందాలు చేసుకుంటుంది బుక్ మై షో. ఇది కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య నిరోధక చట్టానికి వ్యతిరేకమైన బుక్ మై షో పట్టించుకోవట్లేదు.

ఏపీలో 1,140 థియేటర్లు, తెలంగాణాలో 1,250 థియేటర్లు ఉండగా వీటిల్లో అత్యధిక థియేటర్లు ‘బుక్‌ మై షో’ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నాయి. అంతేకాక దేశం మొత్తం మీద కూడా ఏకంగా 78 శాతం ఆన్‌లైన్‌ సినిమా టికెట్లు బుక్‌ మై షో నుంచే విక్రయించేలా ప్లాన్స్ వేసింది. థియేటర్లను బట్టి ఒక్కో టికెట్‌పై రూ.19 నుంచి రూ.25వరకు అదనంగా సర్వీస్ ఛార్జ్ అని వసూలు చేస్తోంది. ఇక వీటిలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు అయితే టికెట్‌కు రూ.8 చొప్పున, మల్టీపెక్స్‌ థియేటర్లకు రూ.14 చొప్పున కమీషన్‌ ఇస్తుండటంతో థియేటర్లు కూడా బుక్ మై షోకి వత్తాసు పలుకుతున్నారు. ఒక్కో టికెట్‌పై బుక్ మై షో సంస్థ రూ.11 వరకు లాభం తీసుకుంటోంది.

థియేటర్ల యాజమాన్యాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా 50శాతానికి పైగా టికెట్లను ఈ సంస్థకే ఇస్తుండటంతో సగటు ప్రేక్షకుడిపై ఒక్కో టికెట్‌పై రూ.19 నుంచి రూ.25వరకు అదనపు భారం పడుతోంది. కొన్ని సంస్థలు తక్కువ అదనపు ఛార్జీతో ముందుకు వద్దామని ప్రయత్నించినా బుక్ మై షో థియేటర్లని తమ చేతిలోనే పెట్టుకుంటుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం రూ.1.95 సర్వీస్‌ చార్జితోనే సినిమా టికెట్ల విక్రయం జరగాలని నిర్ణయం తీసుకొని సొంత పోర్టల్ ని ప్రారంభించడానికి రెడీ అవుతుంది. అందుకే సినిమా టికెట్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్‌లైన్‌లో విక్రయించాలన్న నిర్ణయాన్ని ప్రకటించింది. దాంతో తమకు భారీ నష్టం వాటిల్లుతుందని ‘బుక్‌ మై షో’ సంస్థ ఆందోళన చెందుతుంది.

ఏపీలో ఇది అమలులోకి వస్తే దేశంలోని వేరే రాష్ట్రాలు కూడా ఇందుకు ట్రై చేస్తాయని భావిస్తుంది. అందుకే ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ‘బుక్‌ మై షో’ హైకోర్టులో కేసు వేసింది. మరోవైపు బుక్‌ మై షో గుత్తాధిపత్య పోకడలతో సగటు ప్రేక్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని కొంతమంది ఢిల్లీలోని ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థను ఆశ్రయించారు. దేశంలోని ఏ రంగంలో అయినా గుత్తాధిపత్యంతో వినియోగదారులు నష్టపోకుండా చూసే ఈ సంస్థ గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌లో సినిమా విక్రయాల వాటా, వాటి విలువ మొదలైన అంశాలతో నివేదిక సమర్పించాలని ‘బుక్‌ మై షో’ సంస్థను ఆదేశించింది. అయినా ఆ సంస్థ ఖాతరు చేయలేదు. దీంతో ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరి హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కేసు నెగ్గి బుక్ మై షో దోపిడీ ఆగుతుందా లేదా చూడాలి.