తెలంగాణలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. అధికార పార్టీపైకి రోజుకో కొత్త అస్త్రాన్ని విసురుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఎక్కడా దూకుడును తగ్గించడంలేదు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన మరోమారు అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. సంస్థాగత మార్పుల విషయంలోనూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కుమారుడిని ముఖ్యమంత్రిని చేసే ఆలోచన లేదంటూ కామెంట్ చేశారు.
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత బీజేపీ ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలపై కాన్సంట్రేట్ చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులను తమ గూటికి రప్పించుకున్న బీజేపీ గెలుపు పట్ల గట్టి విశ్వాసంతో ఉంది. తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు తమదే అని, ప్రజలు తమవైపే ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నిన్నా మొన్నటి దాకా టీఆర్ఎస్ నాయకుల నోట ఈ డైలాగ్ వినిపించేంది. కానీ… దుబ్బాక ఫలితాల తరువాత రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. టీఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీజేపీ మాత్రం జెట్ స్పీడ్ లో ప్రయాణం చేస్తోంది.
ఎన్నికల సమయంలో పార్టీల మధ్య మాటల యుద్ధం సరేసరి. కానీ… ఎన్నికలు లేకపోయినా అధికార పార్టీపై బీజేపీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. రోజూ ఏదో ఒక హాట్ కామెంట్ తో బండి సంజయ్ సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు సంజయ్. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతున్నారని, తమ అవినీతి ఆపకపోతే ప్రభుత్వం కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు. కేంద్రం నుంచి అందుతున్న నిధులను టీఆర్ఎస్ నేతలు వెనకేసుకున్నారని ఆరోపించారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓట్లు కోలుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
కేసీఆర్ కుటుంబం ఆరేళ్లుగా చేస్తున్న అవినీతి చిట్టాను త్వరలోనే బయటపెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకున్న నాటి నుంచీ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. బండి సంజయ్ పదే పదే కేసీఆర్ అవినీతి గురించి ప్రస్థావిస్తుండడం గమనార్హం. గతంలో కూడా కేసీఆర్ అవినీతి చిట్టా తమ చేతిలో ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీజేపీ టీఆర్ఎస్ ను చిక్కుల్లోకి నెట్టాలనుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపే టీఆర్ఎస్ ను బలహీన పరచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి.