తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా భారతీయ జనతా పార్టీ ఎంత కింద మీద పడుతుందో అర్థం కావడానికి ఈ చిత్రమే నిదర్శనం. అన్నాడీఎంకే నూ, జయలలిత వారసత్వాన్ని పార్టీకి (కూటమి ) మాత్రమే చెందేలా బీజేపీ పెద్దలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో దీనిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తిపూజ అధికం. దానికి బిజెపి పూర్తి విరుద్ధం. అయితే ఓట్ల వేటలో సాక్షాత్తు ప్రధానికి సైతం కూటమి లోని ప్రధాన పార్టీని కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం అయ్యింది.
ఎంజీఆర్ పూర్తి వ్యతిరేకి!
తమిళనాడు రాజకీయాల్లో అప్రతిహసంగా సాగిపోతోన్న డీఎంకే పార్టీ కు ప్రత్యామ్నాయంగా 1972లో అన్నాడీఎంకే ను మొదలు పెట్టిన ఎంజీ రామచంద్రన్ తర్వాత కేంద్రం రాజకీయాల్లో అంటీ ముట్టనట్లుగానే ఉండేవారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యాన్ని ఆజమాయిషీ ఆయన పూర్తిగా వ్యతిరేకించేవారు. కచ్చితంగా రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ ఉండాలని ఆయన నమ్మేవారు. కేంద్రం నామమాత్రంగానే వ్యవహరించాలి తప్పితే రాష్ట్రాల్లోని అన్ని విషయాల్లో వేలు పెడితే ఇంక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనేది ఎంజీఆర్ ప్రశ్న. దీనికి తగ్గట్టుగానే ఆయన అన్నాడిఎంకె నూ నడిపించారు. ఆయన తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న జయలలిత సైతం ఇదే పద్ధతిని కేంద్రంతో కొనసాగించారు. అన్నా డీఎంకే మద్దతు పొందాలంటే కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అయినా జయలలిత పెట్టే డిమాండ్లను కచ్చితంగా అంగీకరించి మాత్రమే అన్నా డీఎంకే మద్దతు పొందాల్సి వచ్చేది. కేంద్ర రాజకీయాల పట్ల అన్నాడీఎంకే వైఖరి అలా ఉంటే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పూర్తిగా అన్నాడీఎంకే నడిపించే పరిస్థితికి వచ్చింది.
అమ్మ వారసత్వం కోసం బీజేపీ ఆరాటం!
ఈ సారి జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి ఎంతో కీలకం. తమిళనాడులో అన్నా డీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ మొత్తం తానే అన్నట్లుగా రాజకీయాలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న అన్నాడిఎంకె మరోమారు అధికారంలోకి రావాలంటే కచ్చితంగా జయలలిత మృతి తాలూకా సానుభూతి అవసరం. నిన్న మొన్నటి వరకు రజినీకాంత్ మీద కోటి ఆశలు పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు జయలలిత వారసత్వం మీద పోరాడుతుంది. కచ్చితంగా జయలలిత మృతిని సానుభూతిని ఓట్ల రూపంలో పొందేందుకు అన్నాడీఎంకే కూటమి, శశికళ వర్గాలు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. శశికళ ఇటీవల తన హావభావాలతో పాటు, అచ్చం జయలలిత స్టైల్ లో తమిళనాడుకు చేరుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తే, దీనిని అన్నాడీఎంకేతో పాటు బీజేపీ నేతలు సైతం ఖండించడం విశేషం. అంతే కాదు ఇప్పుడు ప్రధాని మోదీ ఏకంగా ఎంజీఆర్ జయలలిత చిత్రాలకు వంగి మరి నమస్కరిస్తూ చెన్నై మెట్రో విస్తరణ పనులు ప్రారంభించడం చూస్తే అమ్మ వారసత్వ పోటీ ఎంతలా ఉందో అర్ధం అవుతుంది.
ఎంజీఆర్ భారతరత్న పై వివాదం చేసిన వారే!
అల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెంట్రా కాజగం (ఏఐఏడీఎంకే ) వ్యవస్థాపకుడు మారత్తూరు గోపాల రామచంద్రన్ (ఎంజీఆర్) కు 1987లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అప్పుడు దానిని వ్యతిరేకించిన పక్షాలే ఇప్పుడు ఆయన మీద గౌరవం, ప్రేమ చూపించడం విశేషం. రాజగోపాలాచారి, కామరాజు తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతరత్న అందుకున్న వ్యక్తి ఎంజీఆర్. 1987లో ఎం.జి.ఆర్ మరణం తర్వాత 1988 లోనే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. అయితే దీనిని విపక్షాలు తప్పు పట్టాయి. తమిళనాడులోని ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ అత్యంత వేగంగా ఎంజీఆర్కు భారతరత్న ప్రకటించిందని, దీని వెనుక అప్పటి ప్రధాని రాజీవ్ అవార్డు కమిటీని ఒత్తిడి గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివాదం చేసిన వారిలో అప్పటి జనతాదళ్ నాయకుల్లో కీలకంగా ఉన్నవారు.. తర్వాత బీజేపీ లోకి మారిన వారు ఉన్నారు.
ఆ గురుతులు ఇంక మెదలాడుతూ!
జయలలిత మృతి తర్వాత బీజేపీ అన్నాడీఎంకే మీద పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవం. జయలలిత స్నేహితురాలుగా చిన్నమ్మ గా తమిళనాడు ప్రజలకు సుపరిచితం అయిన శశికళను దూరంగా పెట్టి జయలలిత భౌతికకాయం సాక్షిగా బిజెపి రాజకీయాలు మొదలు పెట్టిన విషయం అందిరికి గుర్తే. జయలలిత మరణం తర్వాత చిన్నమ్మ శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి చేసేందుకు అన్నా డీఎంకే లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నప్పటికీ పన్నీర్ సెల్వం దానికి ఒప్పుకోకపోవడం ఆయన వెనుక ఉన్న రాజకీయాలు అందరికీ అర్థమయ్యే వే. కనీసం జయలలిత మృతదేహం వద్దకు కూడా శశికళను రానీయకుండా, పూర్తిగా అన్నాడీఎంకే పార్టీ తరపునే ఆమె అంత్యక్రియలు పూర్తి చేసారు. దాని తర్వాత లెజిస్లేటివ్ పార్టీ నేతగా శశికళను ఎన్నుకొని, ఆమెను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు సైతం బీజేపీ అడ్డుపడింది. ఆ నాటి గవర్నర్ విద్యాసాగర్ రావు శశికళను పిలవకుండా కొన్ని రోజులు తాత్సారం చేయడం అప్పట్లో వివాదానికి సైతం దారితీసింది. దాని తర్వాత అక్రమ ఆదాయం కేసులు, శశికళ అరెస్టులు వేగంగా జరిగిపోయాయి. తీర్పు సైతం చాలా వేగంగా రావడంతో ఆమె జైలుకు పరిమితమైంది.
అధికారం పోకుండా!
ఆమెపై కేసులు పెట్టిన వెంటనే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవ్వడం తర్వాత పళనిస్వామి కీ పగ్గాలు అప్పగించడం అంతా బిజెపి కనుసన్నల్లోనే సాగింది. ఇప్పుడు జయలలిత చిత్రం గాని, ఆమె మీద ఉన్న సానుభూతి గానీ లేకుండా అన్నాడీఎంకే నెగ్గుకు రావడం అనేది అసంభవం. అందుకే కూటమిని వెనకుండి నడిపిస్తున్న బిజెపి దీనికోసం ఎన్ని చేయాలో అన్నీ చేస్తుంది. తమిళనాడు తన చేతిలో నుంచి బయటకు వెళ్లకుండా తరచు బిజెపి అగ్రనేతలు తమిళనాడుకు వస్తూ పోతూ ఉన్నారు. మరి బీజేపీ ప్రస్తుత గేమ్ ప్లాన్ ఎంతవరకు విజయం సాధిస్తుంది అన్నది కొద్ది రోజుల్లోనే అర్థమైపోతుంది.