iDreamPost
android-app
ios-app

టీపీసీసీ వైపు బీజేపీ చూపు..!

టీపీసీసీ వైపు బీజేపీ చూపు..!

అదేంటి..? ‌దేశ‌మంతా భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపు చూస్తుంటే.. ఇక్క‌డ టీపీసీసీ వైపు బీజేపీ చూడ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? ప‌్ర‌స్తుతం ఆ పార్టీ టార్గెట్ కాంగ్రెస్ వైపే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌డం కోసం ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర‌తీసిన బీజేపీ దృష్టంతా ఇప్పుడు టీపీసీసీపై ప‌డింది. అందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. జీహెచ్ఎంసీ ఫ‌లితాల అనంత‌రం పీసీసీ చీఫ్ ప‌ద‌వికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ ప‌ద‌వి కోసం కాంగ్రెస్ లోని సీనియ‌ర్లు అంద‌రూ రంగంలోకి దిగారు. మేం పోటీలో ఉన్నామంటే.. మేం పోటీలో ఉన్నామ‌ని కాస్త పేరున్న ప్ర‌తి ఒక్క‌రూ పీసీసీ పీఠం కోసం పోటీ ప‌డుతున్నారు. మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ అయితే హైద‌రాబాద్ న‌గ‌ర అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసి పీసీసీ అధ్య‌క్షుడిగా ప్ర‌మోష‌న్ కోస‌మేనంటూ ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ఆయ‌నే కాదు.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, జానారెడ్డి, జ‌గ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ పీసీసీ పీఠం రేసులో ఉన్నారు.

ఒక్క‌రికే ప‌ద‌వి.. మిగ‌తా వారిలో..?

పీసీపీ పీఠం ప‌ద‌వికి ఎవ‌రైతే పార్టీకి ఉప‌యోగ‌మో తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్యం ఠాకూర్ మూడు రోజులుగా అభిప్రాయ సేక‌ర‌ణ చేస్తున్నారు. ఇది ముగింపు ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. తాజాగా శ‌నివారం దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జ‌రిపారు. అంత‌కు ముందే కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డితో గంట పాటు స‌మావేశ‌మైన‌ట్లు తెలిసింది. కోమ‌టిరెడ్డికే పీసీపీ పీఠం అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో మిగ‌తా నేత‌ల్లో అసంతృప్తి మొద‌లైంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా సరే ఏకాభిప్రాయంతోనే జరగాలని.. వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే పార్టీకే నష్టమని స్పష్టం చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారినే అధ్యక్షుడ్ని చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర జరుగుతోందని, సోనియా, రాహుల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఠాకూర్‌తో తాడోపేడో తేల్చుకుంటామని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవద్దు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లేది ఇప్పుడే చెప్పలేం. సీఎల్పీ, పీసీసీ అధ్యక్షుడిని మేము ఇన్వాల్వ్ చేయడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఎంపిక మెజార్టీ అభిప్రాయం కాకుండా.. ఏకాభిప్రాయం సాధించాలి. ఒక ఇంచార్జ్ జిల్లా స్థాయి నేతలతో మాట్లాడటం తప్పు కాదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు.. మా అభిప్రాయం చెప్పాం. ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ.. కలిశాం. జరుగుతున్న ప్రచారం దృష్ట్యా.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పాం. ఏకాభిప్రాయంతో్ ఎలాంటి పేరు చెప్పలేదు. సోనియాగాంధీ.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని’’ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా.. పీసీసీ చీఫ్ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే మిగతా సీనియ‌ర్ల నేత‌ల అంత‌ర్గ‌త అసంతృప్తి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే అవ‌కాశంగా బీజేపీ వారిని త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు ఎదురుచూస్తున్న‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే జానారెడ్డి, అంజ‌న్ కుమార్ యాద‌వ్ వంటి నేత‌లు బీజేపీలో చేరుతున్న‌ట్లు ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో పీసీసీ ప్ర‌క‌ట‌న కీల‌కంగా మార‌నుంది.