iDreamPost
android-app
ios-app

BJP MLA Raja Singh: చంచ‌ల్ గూడ జైలుకు రాజాసింగ్, బీజేపీ సస్పెండ్

  • Published Aug 23, 2022 | 7:18 PM Updated Updated Aug 23, 2022 | 7:18 PM
BJP MLA Raja Singh:  చంచ‌ల్ గూడ జైలుకు రాజాసింగ్, బీజేపీ సస్పెండ్

త‌రచు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో అల‌జ‌డిని రేపే గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై, హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే రాజాసింగ్‌పై 12 కేసులు పెట్టారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్‌ తరపు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాల మేర‌కు రాజాసింగ్‌ను చంచ‌ల్‌గూడ జైలుకు పోలీసులు త‌ర‌లించారు. చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మ‌ల‌క్‌పేట్‌, చార్మినార్ వెళ్లే దారుల‌తో పాటు చంచల్‌గూడ జైలు ప‌రిస‌రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంత‌కుముందు మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నూపూర్ శ‌ర్మ వ్యాఖ్యల‌తో అంత‌ర్జాతీయంగా ఎంత‌టి ఒత్తిడివ‌చ్చిందో బీజేపీకి తెలుసు. అందుకే రాజాసింగ్‌ విడుదల చేసిన వీడియోపై బీజేపీ హైకమాండ్ ఆగ్ర‌హించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వమంటూ పది రోజులు గడువిచ్చింది. స‌

మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా ఉన్న‌ రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. మజ్లిస్‌ నేతలు అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, ఇతర ప్రాంతాలలో నిరసనలకు దిగారు. దేశ వ్యాప్తంగా రాజాసింగ్‌పై చాలా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు చోట్ల, హైదరాబాద్‌, నాలుగు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓ వర్గం వారిని ఉద్దేశ‌పూర్వ‌కంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న‌ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.