iDreamPost
android-app
ios-app

ఆ పని కూడా చేసి పుణ్యం కట్టుకోండి వీర్రాజు గారు..!

ఆ పని కూడా చేసి పుణ్యం కట్టుకోండి వీర్రాజు గారు..!

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. వైసీపీ సర్కార్‌ విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచిందని, అవి తగ్గించే వరకూ ఉద్యమం చేస్తామని ప్రకటించారు. విద్యుత్‌ ఛార్జీలను పెంచడం తుగ్లక్‌ చర్య అని సోము వీర్రాజు అభివర్ణించారు. ఓ వైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచి, మరో వైపు విద్యుత్‌ కోతలను విధిస్తున్నారంటూ సోము విమర్శలు గుప్పించారు.

సోముకు అభినందనలు..

పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే వరకూ ఉద్యమం చేస్తానని సోము వీర్రాజు చెప్పడం అభినందించాల్సిన విషయం. అయితే ఉద్యమం చేసేందుకు గోరంతను కొండంత చేసి సోము మాట్లాడుతున్నారు. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచారని సోము వీర్రాజు అనడం అందులో భాగమే. పైగా విద్యుత్‌ ఛార్జీలు పెంచడం తుగ్లక్‌ చర్యతో పోల్చడం సోము వీర్రాజు తెలివికి నిదర్శనంగా నిలుస్తోంది. విద్యుత్‌ ఛార్జీలు స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చింది. పెరిగిన ధరలు, పాత అప్పులు కారణంగా పెంచాల్సి వచ్చిందని నేతలు, అధికారులు వివరణ ఇచ్చారు. అయితే ఇవేమీ పట్టని సోము వీర్రాజు తనదైన శైలిలో తుగ్లక్‌ చర్య అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. వేసవిలో డిమాండ్‌ పెరగడంతో విద్యుత్‌ కోతలు అనివార్యమయ్యాయి. ఈ పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉంది. గుజరాత్‌లో పరిశ్రమలకు వారంలో ఒక్క రోజు పవర్‌ కట్‌ విధిస్తున్నారు. ఈ విషయాలు బీజేపీ కార్యకర్తలకు తెలియకపోయినా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు మాత్రం తప్పక తెలుసుకోవాలి.

వాటిపై కూడా ఉద్యమం చేయండి..

స్వల్పంగా పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే వరకూ ఉద్యమం చేస్తామన్న సోము వీర్రాజు ప్రకటనను ప్రజలు స్వాగతిస్తూనే.. మరో విన్నపం కూడా చేస్తున్నారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనెల ధరలు తగ్గించే వరకూ కూడా ఉద్యమం చేయాలని ఏపీ ప్రజలు బీజేపీ దళపతిని కోరుతున్నారు. గత పది రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌పై దాదాపు 8 రూపాయలు పెరిగింది. అదే బాటలో డీజిల్‌ కూడా పయనిస్తోంది. ప్రతి రోజు వీటి ధరలు పెరుగుతున్నాయి. ఇక వంట గ్యాస్‌ ధర 1000 దాటింది. బీజేపీ అధికారంలోకి రాకముందు వంట గ్యాస్‌ ధర 500 రూపాయల లోపు ఉండేది. ఇప్పుడు రెట్టింపు అయింది. వంట నూనెల ధరలు రెట్టింపు అయ్యాయి. పామాయిల్‌ ధర లీటర్‌ గత ఏడాది 70 రూపాయలు ఉండగా.. ఇప్పుడు ఆ ధర 140 రూపాయలకు చేరుకుంది. ఈ ధరలు పేద, మధ్యతరగతి వారి నడ్డి విరుస్తున్నాయి. వీటిని తగ్గించేలా సోము వీర్రాజు ఉద్యమం చేస్తే.. ప్రజలకు ఎనలేని మేలు చేసిన వారు అవుతారు. అంతేకాకుండా ఏపీలో బలపడేందుకు యత్నిస్తున్న బీజేపీ.. ఆ లక్ష్యం చేరుకుంటుంది. మరి సోము వీర్రాజు ప్రజలు చేసిన వినతిపై ఆలోచిస్తారా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి