iDreamPost
android-app
ios-app

వెంకన్నకు లేని మతభేదం వీళ్లకెందుకో?

  • Published Apr 12, 2021 | 12:02 PM Updated Updated Apr 12, 2021 | 12:02 PM
వెంకన్నకు లేని మతభేదం వీళ్లకెందుకో?

తిరుపతి ఉప ఎన్నికల్లో సైద్ధాంతిక పోరాటం వీడి.. సమస్యలను పక్కన పెట్టి బీజేపీ మత రాజకీయాలకు తెర తీసింది. బీజేపీ నేతృత్వంలో దేశాన్ని పాలిస్తున్న ఎన్డీయే ప్రభుత్వం అనేక అంశాల్లో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ పార్టీ వాటిపైనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మతపరంగా వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ అభ్యర్థి మతం ఏమిటన్న ప్రశ్న లేవనెత్తింది.

బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి దియోధర్ రెండురోజుల క్రితం ప్రచారంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంతవరకు తిరుమల వెంకన్నను ఎందుకు దర్శించుకోలేదు.. ఇంతకూ ఆయన మతం ఏమిటి.. అని ప్రశ్నించారు. తద్వారా తిరుపతి ఎన్నికల్లో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి బీజేపీ ప్రశ్నలకు తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశినాడు శ్రీవారిని దర్శించుకున్న వీడియోను రిలీజ్ చేయడమే కాకుండా తిరుపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తమ గ్రామదేవతకు పూజలు చేసిన ఫోటోలు బయటపెట్టి.. బీజేపీకి దిమ్మదిరిగేలా చేశారు.

బీజేపీ మత అసహనం

హిందుత్వ రాజకీయాలతో దేశంలో తరచూ అలజడులు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడం దశాబ్దాలుగా బీజేపీకి అలవాటు. ప్రస్తుత తిరుపతి ఎన్నికల్లో ఓట్ల కోసం నానాపాట్లు పడుతున్న ఆ పార్టీ.. చివరికి తిరుమల వెంకన్న సాక్షిగా ఇక్కడా అదే ఆయుధం ప్రయోగించి.. ఆదిలోనే విఫలమైంది. ప్రస్తుతం తిరుపతిలో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏ తిరుమల వెంకన్న పేరుతో మత రాజకీయం చేసిందో.. అదే వెంకన్నను మత సహనానికి ప్రతీకగా ప్రజలు భావిస్తారు. దీనికి ఒక ఐతిహాసిక ఉదాహరణను కూడా ప్రస్తావిస్తున్నారు.

ముస్లింల అల్లుడు వెంకటేశుడు

తిరుమల చరిత్ర ప్రకారం ముస్లిం ఆడపడుచు అయిన బీబీనాంచారిని శ్రీవారు వివాహం చేసుకోవడంతో ముస్లింలు వెంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. భక్తితో పూజలు చేస్తారు. ఉగాది పండుగ రోజు స్వామివారిని దర్శించుకుని అల్లుడిగా తమ ఇంటి రమ్మని ఆహ్వానిస్తారు. కడప లక్ష్మీవెంకటేశ్వరాలయంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది రోజు వేకువజామునే ముస్లింలు ఈ ఆలయానికి వెళ్లి వెంకన్నకు ప్రత్యేక పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొడతారు. మొక్కులు తీర్చుకుంటారు. హిందువుల మాదిరిగానే స్వామికి ఉప్పు, పప్పు, చింతపండు సమర్పిస్తారు.

చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో ముస్లింలు ఆ రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇంతటి మతసహనానికి ప్రతీకగా నిలుస్తున్న తిరుమల శ్రీవారినే అడ్డుపెట్టుకొని బీజేపీ మత రాజకీయాలు చేయడం విమర్శలు కురిపిస్తోంది. అసలు భారత రాజ్యాంగం ప్రకారం.. కులమతాలతో ప్రమేయం లేకుండా ఓటు హక్కున్న ప్రతి భారతీయుడికి ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కుంది. ఈ హక్కుకు భంగం కలిగించేలా నీ మతం ఏమిటని ఒక అభ్యర్థిని ప్రశ్నించడం పౌరుడి ప్రజాస్వామ్య హక్కుకు భంగం కలిగించడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

Also Read : తిరుప‌తి బై పోల్ : బీజేపీకి దెబ్బ మీద దెబ్బ‌!