iDreamPost
android-app
ios-app

బీజేపీ విధానానికి భిన్నంగా పురందేశ్వరి వాఖ్యలు

  • Published Sep 28, 2020 | 8:32 AM Updated Updated Sep 28, 2020 | 8:32 AM
బీజేపీ విధానానికి భిన్నంగా పురందేశ్వరి వాఖ్యలు

ఏపీ బీజేపీ నేతలు తలో వైఖరి తీసుకోవడం ఈనాటిది కాదు. కానీ ప్రస్తుతం కీలకాంశాలలో తలో మాట మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ తో రాజకీయ రంగప్రవేశం చేసి కేంద్రమంత్రి వరకూ ఎదిగిన పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించగానే చేసిన వ్యాఖ్యలు అందుకు కొనసాగింపుగా ఉన్నాయి. ఆమెతో పాటుగా మరో కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. ఇప్పటికే రామ్ మాధవ్, జీవీఎల్ వంటి సీనియర్లు, ప్రస్తుతం ఏపీ బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు స్పష్టత ఇచ్చిన అంశంలో ఈ ఇద్దరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషంగా మారింది. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వ వైఖరితో బీజేపీకి సంబంధం లేదన్నట్టుగా పురందేశ్వరి వ్యాఖ్యానించడం విస్మకరంగా కనిపిస్తోంది. అంతకుమించి రాయలసీమ డిక్లరేషన్ అంశం కూడా తమకు సంబంధం లేదని ఆమె చెప్పగలరా అనే ప్రశ్నలకు ఆస్కారమిస్తోంది.

ఏపీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. ముఖ్యంగా రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో తాము జోక్యం చేసుకోలేమని చెబుతోంది. ఎక్కడ రాజధాని పెట్టినా కేంద్రం సహకరిస్తుందని వెల్లడించింది విభజన చట్టంలో గానీ రాజ్యాంగంలో కూడా రాజధాని విషయంలో ఎటువంటి అడ్డంకులు లేవని తేల్చిచెప్పింది. అయినప్పటికీ అమరావతి పరిరక్షణ పేరుతో కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఆపడం లేదు. పైగా అందుకు అనుగుణంగా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఆ పరంపరలో పురందేశ్వరి కూడా అలాంటి వాదనలకు బలం చేకూర్చే వ్యాఖ్యలు చేయడం వింతగా మారింది.

బీజేపీ కూడా రాయలసీమ డిక్లరేషన్ ని ఇప్పటికే తీర్మానించింది. దాని ప్రకారం సీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటు కోసం జగన్ ప్రభుత్వం చట్టాలు చేసింది. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తోంది. ఇదే అంశంలో రామ్ మాధవ్ వంటి వారు కూడా తమ పరిధిలో అంశం కాదని తేల్చిచెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టపూర్వంగా నిర్ణయం తీసుకోవాలని, కానీ మూడు రాజధానుల అవసరం ఏపాటితో పునరాలోచన చేయాలని సూచన చేశారు. కానీ జీవీఎల్ వంటి వారయితే ప్రభుత్వ నిర్ణయానికి దాదాపుగా మద్ధతు ప్రకటించారు. సోము వీర్రాజు కూడా మూడు కాదు 30 రాజధానులు పెట్టుకున్నా అభ్యంతరం లేదు..అన్ని ప్రాంతాల అభివృద్ధి తమకు ముఖ్యం అంటూ అమరావతి ఏకైక రాజధాని అంశాన్ని తోసిపుచ్చారు.

ఇవన్నీ తెలిసి కూడా పురందేశ్వరి భిన్నంగా వ్యాఖ్యానించడం ఆమె వ్యక్తిగతమా లేక బీజేపీ వైఖరా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఆమెకు తోడుగా నిన్న మొన్నటి వరకూ వెంకయ్యనాయుడు ఓఎస్డీగా కొనసాగి,ఇప్పుడు జాతీయ కార్యదర్శి అయిన సత్య కుమార్ కూడా అమరావతి అంశాన్ని ప్రస్తావించారు. దాంతో ఈ ఇద్దరు నేతల తీరు ఇప్పుడు బీజేపీలో కొత్త చర్చకు అవకాశం ఇస్తోంది. ఒక్కో నేత ఒక్కో మాట మాట్లాడుతూ ప్రజలతో పాటుగా పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతున్న తీరు విశేషంగా మారుతోంది. ఇలాంటి వైఖరితో బీజేపీకి మరింత నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.