iDreamPost
android-app
ios-app

మత విషం చిమ్ముతున్న బీజేపీ

  • Published Apr 14, 2021 | 1:33 PM Updated Updated Apr 14, 2021 | 1:33 PM
మత విషం చిమ్ముతున్న బీజేపీ

ప్రచారానికి ఇంకొక్క రోజే గడువు మిగిలింది. తిరుపతిపై పెట్టుకున్నఆశలు తీరవని తేలిపోవడంతో డీలా పడిన కమలనాథులు చివరి ప్రయత్నంగా మతాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ఉన్న ఒక్కరోజు గదువులో ఓటర్లపై మత విషం చిమ్మి సాధ్యమైనన్ని ఓట్లు రాబట్టుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఆ ప్రయత్నం చేసి బొక్కబోర్లాపడిన బీజేపీ నేతలు.. అది మినహా వేరే గత్యంతరం లేకపోవడంతో కొద్దిగా లైన్ మార్చి మళ్ళీ అదే మతం కార్డ్ ప్రయోగిస్తున్నారు.

మొన్న అలా.. నేడు ఇలా..

మత రాజకీయాలతో దేశంలో అలజడులు సృష్టించి.. అధికారం సంపాదించడమే అజెండాగా పెట్టుకున్న బీజేపీ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి మత రంగు పూయడానికి ఒకసారి ప్రయత్నించి విఫలమైంది. మొన్నామధ్య ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ మాట్లాడుతూ తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంతవరకు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించుకోలేదంటూనే.. ఆయనది ఏ మతం అని ఓ ధర్మ సందేహం లేవనెత్తారు. దానికి కౌంటర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి వైకుంఠ ఏకాదశి నాడు తాను శ్రీవారిని దర్శించుకున్న, తమ గ్రామదేవతకు పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు బయటపెట్టి.. సాధికారికంగా బీజేపీ నేతల నోళ్లు మూయించారు.

ఆ దెబ్బతో కొద్దిరోజులు ఆ విషయాన్ని ప్రస్తావించడం మానేసిన కమలం నేతలకు.. ప్రచారంలో ఏదీ కలిసిరాని పరిస్థితుల్లో మళ్లీ మతమౌఢ్యమే గతయ్యింది. ఈసారి ఆ పార్టీ ఎంపీ జీవీయల్ నరసింహారావు మత విషం చిమ్మే బాధ్యత తీసుకున్నారు. తిరుపతి వచ్చినవారు శ్రీవారిని దర్శించుకోకుండా ఉండరని.. కానీ అధికార పార్టీ అభ్యర్థి గురుమూర్తి ఎందుకు దర్శించుకోలేదని ప్రశ్నించారు. ఇంతకూ ఆయన హిందువో కాదో చెప్పాలన్నారు. అక్కడితో ఆగకుండా గుడూరులో గురుమూర్తి చర్చికి వెళ్లి బిషప్ ఆశీస్సులు తీసుకున్న విషయం ప్రస్తావిస్తూ క్రిస్టియన్ అన్న ముద్ర వేయడానికి ప్రయత్నించారు.

Also Read : అసమర్థులెవరో..? ప్రజలకు తెలుసు సోముజీ..!

క్రిస్టియన్ అయితే ఎస్సీలకు రిజర్వ్ చేసిన తిరుపతిలో పోటీకి అనర్హుడని అన్నారు. గురుమూర్తి మతంపై అనుమానాలుంటే.. వాటికి ఆధారాలుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఈసీ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటుంది. చట్టపరంగా ఉన్న ఈ మార్గాన్ని కాదని.. ప్రెస్ మీట్లు, ప్రసంగాల్లో మత పరమైన ఆరోపణలు చేయడం మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమేనన్న విషయాన్ని బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. దీన్ని బట్టే వారి మత అజెండా అర్థమవుతోంది.

మోదీ అలా.. నేతలు మరోలా..

ఎన్డీయే ప్రభుత్వ సారధి, ప్రధాని నరేంద్రమోదీ వివిధ ప్రాంతాల పర్యటనలకు వెళ్ళేటప్పుడు ఆయా ప్రాంతాలు, మతాల సంప్రదాయాలకు అనుగుణంగా
కట్టు, బొట్టు, వేషధారణ అనుసరిస్తుంటారు. మత సహనానికి తనను తాను ప్రతినిధిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆయన పార్టీ నేతలు మాత్రం అయినదానికీ కానిదానికీ మతాన్ని ప్రస్తావిస్తూ ప్రశాంత సమాజంలో విషం చిమ్ముతున్నారు. తిరుపతిలో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభావాన్ని అణు మాత్రమైనా తగ్గించలేక.. జనసేన సహాయ నిరాకరణతో ప్రచారం చేయలేక.. పూర్తి నిరాశ నిస్పృహాల్లో కూరుకుపోయి.. చివరికి మతాన్నే నమ్ముకునే దుస్థితికి దిగజారారు బిజెపి నేతలు.

Also Read : తుది అంకంలో బీజేపీ దిగాలు