Idream media
Idream media
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఇక మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ నగర పర్యటనలో ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కేడర్ నిర్మాణం దిశగా అడుగులు వేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్ హయాంలో పేదలు, సామాన్యులు ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పేర్కొంటూ, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది. ఈ బస్సు యాత్ర అనంతరం రెండో దశలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల పాదయాత్రల అంశం చర్చకు వచ్చింది. అంతకన్నా ముందే బీజేపీ తరఫున బస్సు యాత్ర, ఆ వెంటనే సంజయ్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందే సంజయ్ నగరంలో పాదయాత్ర చేయాలనుకున్నారు. కానీ, సమయాభావంతో ఆ అవకాశం దక్కలేదు. పార్టీ ముఖ్యనేతలు అందించిన వివరాల ప్రకారం జనవరి లేదా ఫిబ్రవరిలో సంజయ్ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉండగా, అంతకన్నా ముందే బస్సుయాత్ర ఉండనుంది.
కార్యకర్తలు లేని ప్రాంతాలపై నజర్..
పార్టీ సంస్థాగత పటిష్ఠతలో భాగంగా బూత్‌స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఏయే ప్రాంతాల్లో కార్యకర్తలు లేరో అక్కడ కేడర్‌ను తయారు చేసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కమిటీలు ఉన్నా, పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టాలని పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ‘‘వాస్తవానికి ఈ ప్రక్రియ ఎప్పుడో చేయాల్సింది. కొవిడ్-19, అంతకుముందు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వంటి కారణాల వల్ల పూర్తిచేయలేకపోయాం. నిన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఈ లోటు కారణంగా 20 డివిజన్లను కోల్పోయినట్లు గుర్తించాం’’.. అని బీజేపీ సీనియర్ నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో, పార్టీపరంగా ఏ కార్యక్రమం ప్రతిపాదించినా బూత్‌స్థాయి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. జనవరి 15లోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని తరుణ్ ఛుగ్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పొత్తులు.. రాజీలకు అవకాశం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.
మహబూబ్ నగర్ పర్యటనలో బండి సంజయ్ కు షాక్..!
రాష్ట్రంలో మరింత దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్న బీజేపీకి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ షాక్ తగిలింది. జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పేరిట ఒక నోట్ విడుదలైంది. అనివార్య కారణాల వల్ల తాను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు శేఖర్ అందులో పేర్కొన్నారు. తనే స్వయంగా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ఈ విషయం వెల్లడించారు. రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మహబూబ్ నగర్ పర్యటనలోనే ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటనలో ఉండగా జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.