iDreamPost
android-app
ios-app

పుట్టింటికి వచ్చాక మళ్ళీ దూకుడు పెంచిన రాములమ్మ

పుట్టింటికి వచ్చాక మళ్ళీ దూకుడు పెంచిన రాములమ్మ

ఇటీవల బీజేపీ చేరిన విజయశాంతి మళ్లీ గళం విప్పుతున్నారు. పుట్టింటికి వాచ్చక రాములమ్మలో దూకుడు కనిపిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. ఈ క్రమంలో పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ సాధించిన విజయాలతో ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీలోని అసంతృప్తవాదులు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా బీజేపీలో చేరతారని విజయశాంతిపై ప్రచారం సాగింది. అది రెండు రోజుల క్రితం నిజమైంది.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన వెంటనే విజయశాంతి తనలోని దూకుడును బయటపెట్టారు. సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. నిన్న జరిగిన బం«ద్‌ అంశంగా విజయశాంతి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించారు. విజయవంతమైన బంద్‌ను తన ఖాతాలో వేసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రయత్నించారని విజయశాంతి విమర్శించారు. చివరి నిమిషంలో వచ్చి డ్రైవర్‌ సీటులో కూర్చుని క్రెడిట్‌ హైజాక్‌ చేయాలని యత్నించారని రాములమ్మ మాటలతూటాలు పేల్చారు. కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీల ఆధ్వర్యంలోనే బంద్‌ జరిగిందని కితాబిచ్చారు. ఫాం హౌస్‌ రాజకీయాలే కేసీఆర్‌ నిజస్వరూమంటూ మండిపడ్డారు.

తెలుగు సినీ రంగంలో ఓ వెలుగువెలిగిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టారు. బీజేపీ నుంచి రాజకీయారంగేట్రం చేశారు. కొద్ది కాలానికి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి ఆ పార్టీ తరఫున లోక్‌సభకు ఎంపికయ్యారు. తర్వాత కేసీఆర్‌తోనూ పోసగక.. కాంగ్రెస్‌లో చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షురాలుగా పని చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి తిరిగి బీజేపీలో చేశారు. విజయశాంతి తన రాజకీయ జీవితం ఎక్కడ నుంచి ప్రారంభించారో తిరిగి అక్కడకే చేరుకున్నారు. అలా కషాయ కండువా కప్పుకున్న వెంటనే విజయశాంతి ఆ పార్టీ ప్రధాన లక్ష్యమైన కేసీఆర్‌పై విమర్శలు కురిపించారు.