iDreamPost
iDreamPost
ఇటీవల బీజేపీ కేంద్ర పాలక వర్గం ప్రకటనల్లో కరుడుగట్టిన బీజేపీ నాయకులకే పదవులిచ్చారని, తద్వారా కష్టపడేవారికే ప్రాధాన్యం లభించిందని అంతా అన్నారు, అనుకున్నారు. మెజార్టీ వాస్తవం కూడా ఇదే. కానీ విశాఖ ఎంపీగా, ఏపీ బీజేపీలో కీలకమైన నాయకుడిగా కూడా చాలాకాలం సేవలందించిన కంభంపాటి హరిబాబు విషయంలో బీజేపీ పెద్దలు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆదినుంచీ బీజేపీలోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా గెలిచారు కూడా. ఇందుకు టీడీపీ పరోక్షంగా సాయం చేసిందన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనాప్పటికీ బీజేపీ తరపున రాష్ట్రంలో ఒకప్పుడు ప్రధాన గొంతుకగా ఉన్న కంభంపాటిపై ఆ పార్టీ పెద్దలు ఎందుకు శీతకన్నువేసారన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది.
నిజానికి కంభంపాటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ఒక వర్గం బీజేపీ నాయకులు ఆరోపిస్తుంటారు. నిజానిజాల మాటెలా ఉన్నాగానీ ఈయనకంటే పార్టీలో జూనియర్ అయిన పురందరేశ్వరికి కీలకమైన పదవి కట్టబెట్టినప్పటికీ, కంభంపాటిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల ఆ పార్టీ నాయకుల్లోనే చర్చకు ఆస్కారం ఏర్పడింది. టీడీపీ–బీజేపీ సంయుక్తంగా ఉన్నప్పుడు యాక్టివ్ పాత్ర పోషించిన హరిబాబు ఇప్పుడు మాత్రం నిమ్మకుండిపోయారు. పార్టీలో జాతీయ స్థాయి పదవులు కూడా నిర్వహించిన ఈయన ఇప్పుడిలా ఉండిపోవడం పట్ల ఆయన వర్గీయుల్లో బీజేపీ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోందన్న వాదన కూడా ఉంది.
గత కొంత కాలంగా దాదాపు అజ్ఞాతవాసం చేస్తున్న ఆయన్ను అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా? లేక ఆయనే పక్కకకు తప్పుకున్నట్టా? అన్న ప్రశ్నలకు ప్రుస్తతం జవాబుదొరకడం లేదు. కొత్తనీరు వచ్చాక పాతనీరు వెళ్ళిపోవాల్సిందే అన్న సూత్రం మేరకు కంభంపాటి తనకుతానుగానే పక్కకు జరిగారా? లేక తనకు అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అన్నది అంతుబట్టడం లేదని చెబుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటుంటారు. ఎవరి సహకారంతోనైతేనేమి ఒకప్పుడు బీజేపీకి ప్రధాన నాయకుల్లో ఒకరిగా ఉన్న కంభంపాటి హరిబాబు ఇప్పుడు ఎవ్వరికీ కానివారు కావడం విచారకరమేమరి.