Idream media
Idream media
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ ఇటీవల బయటపడిన అంతర్గత కలహాలపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ నెల 18న కానీ.. తర్వాత గానీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ నాయకులతో సమావేశం కానున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో బలోపేతం కావాలంటే సమష్టి కృషి అవసరమని జాతీయ నేతలు భావిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంపై దృష్టి పెడుతున్న పార్టీ ఆయా రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు కావాల్సిన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తెలంగాణపై దృష్టి పెట్టింది.
కాంగ్రెస్ కార్యక్రమాలపై సమీక్ష
ఇటీవల రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ ఆ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీన్ని సీరియస్ గా పరిగణించిన జాతీయ నాయకత్వం ఆ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలోని అంతర్గత విభేధాలను చక్కదిద్దుతూనే.. ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని భావిస్తోంది. అలాగే ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్షించేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బలోపేతమే లక్ష్యంగా రెండు దశల్లో వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా పదాధికారులతో సమావేశం కానున్నారు.
రాష్ట్ర కార్యవర్గ సమావేశం
పదాధికారులతో సమావేశం అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే క్షేత్రస్థాయి పోరాటాలపై కూడా కార్యాచరణ తయారుచేయనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. సంస్థాగతంగా జీహెచ్ఎంసీ పరిధిని ఆరు జిల్లాలుగా విభజించడం ద్వారా ఇప్పటికే నూతన పంథా అవలంబిస్తోంది. స్థానికంగా నాయకత్వాన్ని పెంచింది. దీని ద్వారా గ్రేటర్ లో విస్తరించాలని ప్రయత్నిస్తోంది.