Idream media
Idream media
వచ్చే ఏడాది తొలి ఆరు నెలల కాలం ముందుగానే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీకి ఊహించని పరాభవం ఎదురైంది. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ స్థానిక ఎన్నికల్లో బీజేపీకి కొన్ని చోట్ల పరాభవం ఎదురైంది. కరోనా రెండో దశ విజృంభణ.. కట్టడిలో కేంద్రం ప్రభుత్వం లోపాలు ఇప్పుడు బీజేపీకి బ్రేకులుగా మారాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా ఢిల్లీలో పార్టీ పెద్దలతో కీలక సమావేశం నిర్వహించింది.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. వరుసగా సమావేశాలు, మంతనాలు సాగిస్తూ వ్యూహ-ప్రతివ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి.
వీటిలో పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తయితే జమ్ము-కశ్మీర్ అసెంబ్లీకి కూడా వీటితో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ సృష్టించిన సునామీలో ఇన్నేళ్లుగా నిర్మించుకున్న ప్రధాని మోదీ ప్రతిష్ట కాస్తా తీవ్రంగా దెబ్బతినడంతో, మళ్లీ దాన్ని పునర్నిర్మించుకుంటూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కమలనాధులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) సహా పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు తీవ్రస్థాయిలో మేధోమధనం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాషాయదళాన్ని సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం తీవ్రస్థాయిలో కలవరపెడుతోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఘోరంగా విఫలమైందన్న అపఖ్యాతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదముందని అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు ప్రతిఒక్కరూ భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం గూడుకట్టుకుని నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయే ప్రమాదముందని నాయకత్వం గుర్తించింది.
ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఇదే రాష్ట్రం వరుసగా రెండుసార్లు మోదీని ప్రధానిని చేయడంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి రాష్ట్రంలో పట్టు కోల్పోతే, 2024 సార్వత్రిక ఎన్నికలకే ఎసరు పెట్టే ప్రమాదముందని నాయకత్వం భావిస్తోంది.
ఈ రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమి జాతీయ నాయకత్వాన్ని కలచివేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఇలాఖా గోరఖ్‌పూర్‌లోనే బీజేపీ కంటే ప్రతిపక్షాలు, స్వతంత్రులు ఎక్కువ చోట్ల గెలుపొందారు. అయోధ్యలో పరిస్థితి మరీ దారుణం. 40 సీట్లలో బీజేపీ గెలిచించి కేవలం ఆరు మాత్రమే. సమాజ్‌వాదీ పార్టీ 24 చోట్ల గెలుపొందగా, 5 సీట్లు బీఎస్పీ వశమయ్యాయి. మథురలో 33 సీట్లకు 8 చోట్ల మాత్రమే బీజేపీ గెలుపొందగలిగింది. 13 చోట్ల మాయావతి పార్టీ బీఎస్పీ గెలుపొందింది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో అత్యధిక సంఖ్యలో ఎంపీలను అందించిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ మాత్రం తేడా వచ్చినా, ఢిల్లీ పీఠాలు కదిలిపోయే ప్రమాదముంది. జనాభాపరంగా చూస్తే అనేక ప్రపంచదేశాల కంటే పెద్దదైన ఉత్తర్ ప్రదేశ్, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో పెద్ద రాష్ట్రం బెంగాల్‌లో పట్టుసాధించాలన్న కమలనాథుల కల తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెదిరిపోయింది. దీంతో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీలో ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ పెద్దలు తీవ్ర మేథోమథనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఎంత వరకూ విజయం సాధిస్తుందో వేచి చూడాలి.