iDreamPost
iDreamPost
రెండు రోజులు కూడా కాలేదు. రాయలసీమ అభివృద్ధికి తాము కట్టబడి ఉన్నామని ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నగరంలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. రాయలసీమను అభివృద్ధి చేసేది బీజేపీనని ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది..మరి అంతలోనే అమరావతి వెళ్లి తాము మూడు రాజధానులకు వ్యతిరేకం అంటూ ఎలా మాట్లాడతారూ అనే ప్రశ్న ఇప్పుడు బీజేపీ శ్రేణులనే సతమతం చేస్తోంది. సీమలో అలా..అమరావతిలో ఇలా అన్నట్టుగా రెండు నాలుకల ధోరణిలో మాట్లాడుతున్నారా లేక రాజధానుల అంశంలో బీజేపీ నేతలు యూటర్న్ తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి రాయలసీమ అభివృద్ధి విషయంలో బీజేపీ నేతల మాటలకు, ఆచరణకు పొంతనలేదనే ఆరోపణలున్నాయి. పైగా తిరుపతి సభ సాక్షిగానే ఆంధ్రప్రదేశ్ కి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను అమలుపరచలేదనే ఆగ్రహం కూడా ఉంది. అంతకుమించి రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కర్నూలు కేంద్రంగా చేసిన తీర్మానం కూడా బీజేపీ అమలుపరచడం లేదనే అసంతృప్తి సర్వత్రా ఉంది. బుందేల్ ఖండ్ తరహాలో వెనుకబడిన జిల్లాలకు కేటాయించాల్సిన నిధులను విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మోడీ సర్కారు మొండిచేయి చూపింది. తద్వారా రాయలసీమ 4 జిల్లాలకు ఏటా రావాల్సిన నిధులు మరుగుపోయాయి. మన్నవరం ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలను కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత బీజేపీ విస్మరించింది. ఇక సాగునీటి ప్రాజెక్టులు, ఇతర సమస్యల విషయంలో కూడా అదే తంతు. ఆఖరికి కర్నూలులో హైకో్ర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ దానికి భిన్నంగా అమరావతికి తరలించింది. ఇతర అనేక సంస్థలను సీమలో ఏర్పాటు చేయాల్సి ఉన్న వాటిని కూడా అమరావతిలోనే స్థాపించిన చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది.
ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో ఏపీ హైకోర్ట్ ఏర్పాటు చేయాలని చట్టం చేసింది. బీజేపీ విధానాల ప్రకారం దానిని సమర్థించాలి. తాము చేసిన తీర్మానానికి అనుగుణంగా మద్ధతివ్వాలి. ఆ ప్రక్రియ పూర్తి చేసేందుక తోడ్పాటునందించాలి. కానీ తిరుపతి సభలో కర్నూలు హైకోర్ట్ కి సై అంటున్న బీజేపీ నేతలే అమరావతి వెళ్లి నై అంటుండడం విశేషంగా కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే మాట మారుస్తున్నారా లేక తిరుపతి ఓటర్లు అంతా మరచిపోతారని విశ్వసిస్తున్నారా అన్నది మాత్రం అర్థంకావడం లేదు. తుళ్లూరు సభలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలవుతున్నాయి. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, తాము అధికారంలోకి వస్తే 5వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. అంటే రాయలసీమకు అందుబాటులో కర్నూలు, ఉత్తరాంద్రలోని విశాఖలో పాలనా వ్యవహారాలకు బీజేపీ అంగీకరించడం లేదని భావించాల్సి ఉంటుంది.
ఓవైపు రాజధాని అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలో ఉంటుందని రాజ్యాంగం, కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే దానికి విరుద్ధంగా బీజేపీ ఏపీ నేతలు ఎక్కడికి వెళితే అక్కడి మాట మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. రాయలసీమ అభివృద్ధి విషయంలో బీజేపీ నేతల మాటలకు, చేతలకు పొంతనలేదనే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది.