iDreamPost
iDreamPost
రాష్ట్ర రాజకీయాలలో తనదైన శైలిలో చాణక్య రాజకీయం చేయడంతో పాటు, రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన రాజకీయ దురంధరుడిగా ఆయనకు పేరుంది. కింగ్‌మేకర్‌గా ప్రసిద్ధి పొంది ఊరుపేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఘనత రాయవరం మునసబుకు దక్కుతుంది. అసలు పేరు ఉండవిల్లి సత్యనారాయణమూర్తి అయినప్పటికీ వంశపారంపర్యంగా వచ్చిన మునసబు గిరీ ఆయనకు నిక్‌నేమ్‌గా మారింది. దత్తుడు కూడా అయిన ఈయనను జనం రాయవరం దత్తుడు అని పిలిచేవారు. దాదాపు 1600 ఎకరాల భూస్వామి అయిన ఈయన సింహభాగం రాజకీయాలకే వెచ్చించారని చెప్పుకుంటారు.
నాటి ప్రధాని ఇందిరాగాంధీ వద్ద ఈయనకు మంచి పలుకుబడి ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్దే పట్టు ఉండడంతో రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రులను సైతం మార్పించిన ఘనత మునసబుకు ఉందని ఆయన శిష్యులు నేటికీ చెబుతారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి కావడంలో ఈయన కీలకపాత్ర పోషించారంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎందరికో ఎన్నో ఉపకారాలు చేశాడని ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు.
Also Read : మాజీ ఎమ్మెల్యే,సీనియర్ నేత ,సాహిత్య కారుడు డా.ఎం.వి .రమణారెడ్డి మృతి
రాజకీయ గురువు..
ఆనాటి జమీందారులకు దీటైన సమాధాన మిస్తూ రాజకీయాలు నెరిపారు. ధనవంతులకే కాదు సామాన్యులకు కూడా రాజకీయాలను పరిచయం చేసి ఎందరికో తన రాజకీయ కార్ఖానాలో ఓనమాలు దిద్దించి రాష్ట్ర నాయకులుగా తయారు చేశారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ రాజ్యసభ సభ్యురాలు తటవర్తి రత్నాబాయి, మాజీ మంత్రి దివంగత సంగీత వెంకటరెడ్డి(చినకాపు), మాజీ ఎమ్మె ల్యేలు తేతలి రామారెడ్డి, వల్లూరి రామకృష,్ణ బొడ్డు భాస్కర రామారావు, తదితరులు ఎందరో రాయవరం మునసబు వద్ద శిష్యరికం చేశారు.
మొదటిసారి పోటీ 1983లో..
సర్పంచ్, సమితి ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ తెరవెనుక ఉండి పావులు కదుపుతూ రాజకీయ చదరంగం ఆడిన ఆయన మొదటిసారి 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. తెలుగుదేశం ఆవిర్భావం రాష్ట్రంలో ఒక సంచలనం అన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దీటైన అభ్యర్థులను నిలపడం కష్టమైంది. ప్రతి ఎన్నికల్లో ఎందరికో టికెట్లు ఇప్పించే ఈయన 1983 ఎన్నికల్లో స్వయంగా నాటి ప్రధాని, ఏఐసీసీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ ఆదేశించడంతో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎస్‌ఆర్‌కే రామచంద్రరాజు (రాజబాబు) నిలుచున్నారు. తెలుగుదేశం ప్రభంజనంలో ఈయన పలుకుబడి, రాజకీయ అనుభవం నిలబడలేకపోయాయి. ఆ ఎన్నికల్లో ఓడిన ఆయన మరెప్పుడూ పోటీ చేయలేదు. కానీ తుది వరకూ తెరవెనుక రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
Also Read : కరోనా మందు ఆనందయ్య కొత్త పార్టీ?
విద్యారంగంలో సేవ..
సామాన్యులకు ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా రాయవరం మున్సబు గారి వద్దకు వెళితే అయిపోతుందని ప్రతీతి. వివిధ పనుల నిమిత్తం ఆయన వద్దకు వచ్చే జనాన్ని తన సొంత ఖర్చులతో జిల్లా రాజధానికి, రాష్ట్ర రాజధానికి తీసుకువెళ్లి మరీ ఆ పనులు పూర్తి చేసేవారు. రాజకీయాలు చేయడంలోనే కాకుండా అభివృద్ధిలోను ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. రాయవరం శ్రీ రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలను, రామచంద్రపురంలో తన పేరున వుండవల్లి సత్యనారాయణ మూర్తి (వీఎస్‌ఎం) డిగ్రీ కళాశాలను 1966లో ఏర్పాటు చేశారు. రాయవరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేసి తన దూరదృష్టిని చాటుకున్నారు.
భీమేశ్వరుని సన్నిధిలో తుదిశ్వాస..
1989 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులతో నామినేషన్లు వేయించే పనిలో భాగంగా సినీ నటి జమున, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లతో కలసి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామి సన్నిధిలో కార్తీకమాసంలో ఏకాదశి రోజున లక్షపత్రి పూజ చేయిస్తూ నవంబర్ 6న గుండెపోటు వచ్చి అక్కడే కన్నుమూశారు.
Also Read : రూటు మార్చిన రాహుల్, కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్