iDreamPost
టాలీవుడ్ గడ్డు పరిస్థితులు ఎదురుకుంటున్న తరుణంలో థియేటర్ కు వెళ్లేందుకు ప్రేక్షకులు స్ట్రాంగ్ కంటెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, విక్రమ్, మేజర్ లు అలవాటయ్యాక మాములు కథలను చూసేందుకు ఇష్టపడటం లేదు. అలాంటి వారికి బింబిసార మంచి ఛాయసే. పెద్దగా అంచనాలు పెట్టుకోనివారికి డీసెంట్ థ్రిల్స్ ఇస్తుంది.
టాలీవుడ్ గడ్డు పరిస్థితులు ఎదురుకుంటున్న తరుణంలో థియేటర్ కు వెళ్లేందుకు ప్రేక్షకులు స్ట్రాంగ్ కంటెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, విక్రమ్, మేజర్ లు అలవాటయ్యాక మాములు కథలను చూసేందుకు ఇష్టపడటం లేదు. అలాంటి వారికి బింబిసార మంచి ఛాయసే. పెద్దగా అంచనాలు పెట్టుకోనివారికి డీసెంట్ థ్రిల్స్ ఇస్తుంది.
iDreamPost
నందమూరి వారసుల్లో ఒకడిగా పరిశ్రమకు పరిచయమైన కళ్యాణ్ రామ్ అడపాదడపా హిట్లు సాధిస్తున్నప్పటికీ వాటి కన్నా ఎక్కువ ఫ్లాపులే ఉండటంతో కెరీర్ ఆశించినంత వేగంగా సాగలేదు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే తను చాలా వెనుకబడ్డాడు. అయినా కూడా కళ్యాణ్ రామ్ మీద ప్రేక్షకుల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. చేసే ప్రయోగాలు కావొచ్చు, మనిషి వ్యక్తిత్వం కావొచ్చు వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకునే కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద రూపొందిన భారీ చిత్రం బింబిసార. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దీని మీద అంచనాలు పెరగడం మొదలైంది. ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టిన ఈ రాజు ఎలా ఉన్నాడో రివ్యూలో చూద్దాం
కథ
త్రిగర్తల రాజు బింబిసారుడి(కళ్యాణ్ రామ్)కి ఒళ్ళంతా అహం. తనను ఎదిరించిన వారు ఎవరైనా సరే ప్రాణాలు తీసేంత వరకు వదలడు. ఓ మాయ బింబం వల్ల ఇతని స్థానంలో తమ్ముడు దేవదత్తుడు(కళ్యాణ్ రామ్)వచ్చి బింబిసారని ఇప్పటి వర్తమానానికి పంపిస్తాడు. తనలో చెడ్డ గుణాలతో కొంత కాలం గడిపాక తన తప్పేంటో అతనికి తెలుస్తుంది. అంతేకాదు తన వారసులు తనను ఎంత గొప్పగా పూజిస్తున్నారో అర్థమవుతుంది. మరోవైపు ధన్వంతరి గ్రంధం కోసం వేటాడుతున్న ఓ డాక్టర్(వారినా హుసేన్) వీళ్ళ కుటుంబానికి ప్రమాదం తలపెడతాడు. చివరికి అన్నదమ్ముల కాల ప్రయాణం చివరికి ఏ గమ్యం చేరుకుందనేది తెరమీదే చూడాలి.
నటీనటులు
ఒక యాక్టర్ గా కళ్యాణ్ రామ్ ఫెయిలైన దాఖలాలు పెద్దగా లేవు. డెబ్యూ మూవీ ఆడకపోయినా అతనొక్కడే నుంచి తనలో మొదలైన మెరుగుదల బింబిసార వరకు కొనసాగుతూ వచ్చింది. ఇందులోనూ రెండు షేడ్స్ ని పోషించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా టైటిల్ రోల్ లో ఇచ్చిన వేరియేషన్స్ చాలా బాగా పండాయి. తన స్థాయికి మించిన క్యారెక్టర్ అయినప్పటికీ దాన్నో ఛాలెంజ్ గా తీసుకున్న తీరు మెప్పిస్తుంది. తారక్ చెప్పినట్టు ఇది తను తప్ప ఇండస్ట్రీలో ఎవరూ చేయలేనిది కాదు కానీ బింబిసారగా ఇందులో కళ్యాణ్ రామ్ ని చూశాక ఇది చేయాలని రిస్క్ చేసి మరీ అతను తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది.
క్యాథరిన్ త్రెస్సా రాజసం ఉట్టిపడే పాత్రలో బాగుంది. బొద్దుగా మారాక సరైనోడు టైం నాటి ఛార్మ్ తగ్గినప్పటికీ తనవరకు సినిమాలో చేయడానికి ఏమి లేకుండా పోయింది. సంయుక్త మీనన్ ని ఒక్క రోజు కాల్ షీట్ తో మేనేజ్ చేసినట్టు ఉన్నారు. మహా అయితే ఓ అయిదారు సీన్లలో కనిపిస్తుంది అంతే. ప్రకాష్ రాజ్ వల్ల ప్లస్సూ లేదు మైనస్సూ లేదు. చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కాసిన్ని నవ్వులకు పరిమితమయ్యారు. రాజీవ్ కనకాల, సాయికిరణ్ లు మొక్కుబడిగా ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ చక్కగా ఉంది. విలన్ పాత్రధారి వారిన హుసేన్ ని మొహమాటంతో తీసుకున్నారో ఏమో కానీ అతనే పెద్ద మైనస్ అయ్యాడు. హిందీలో మాట్లాడించి తెలుగు డబ్ ఇచ్చారు. అయ్యప్ప పి శర్మది అఖండకు ఎక్స్ టెన్షన్ లాగా అనిపిస్తుంది.
డైరెక్టర్ అండ్ టీమ్
ఫాంటసీ జానర్ రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. సరిగ్గా ఒడిసిపట్టుకుని నైపుణ్యం చూపిస్తే అద్భుతాలు చేయొచ్చు. మగధీర, జగదేకవీరుడు అతిలోకసుందరి, యమగోల లాంటి చిత్రాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోవడానికి కారణం ఇదే. వీటిని చూసే స్ఫూర్తి చెందానని కళ్యాణ్ రామ్ చెప్పిన మాట దర్శకుడు వశిష్ట ఆలోచనల్లో తెరమీద కనిపిస్తుంది. ఇలాంటి థీమ్ తో మెప్పించడం చాలా కష్టం. ఏ మాత్రం అటుఇటు అయినా నవ్వులపాలవ్వడం ఖాయం. ఇంత బడ్జెట్ తో అందులోనూ మార్కెట్ వేల్యూ తక్కువగా ఉన్న మీడియం రేంజ్ హీరోతో ఇలాంటి ప్రయోగం చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మనం ఆశించేది ఇదే.
బింబిసార టేకాఫ్ చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. మంచి విజువల్స్ తో ఇంటరెస్టింగ్ అనిపిస్తుంది. బింబిసార బ్యాక్ డ్రాప్ మొదలయ్యాక టెంపో కొంత అటుఇటు అయినప్పటికీ ఓవరాల్ గా మరీ బ్యాడ్ ఫీలింగ్ రాకుండా దర్శకుడు వశిష్ట్ కేర్ తీసుకున్నాడు. కాకపోతే బింబిసారుడిని చెడుగా చూపించే క్రమంలో కళ్యాణ్ రామ్ ఇమేజ్ ని బ్యాలన్స్ చేయాలనే ఒత్తిడిలో కొంచెం ఎక్కువ జాగ్రత్త పడటంతో అక్కడ అతి క్రూరంగా కనిపించాల్సిన అతను అంత మోతాదులో ప్రొజెక్ట్ అవ్వడు. తనికెళ్ళ భరణితో పాటు పాపను హత్య చేసే ఎపిసోడ్ ని డిజైన్ చేసిన తీరు బాగానే ఉంది కానీ ఎక్కడికక్కడ ఇంకా బాగుండాల్సిందన్న ఫీలింగ్ కలిగిస్తుంది.
ఫాంటసీలలో లాజిక్స్ కి చోటు ఉండదు. ఇందులోనూ అంతే. కొన్ని చోట్ల కథనం సిల్లీగా అనిపిస్తుంది. మరికొన్ని సార్లు అదేంటి ఇలా చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఆదిత్య 369లాగా అసలు పాయింటే ఊహలకు తర్కాలకు అందనప్పుడు వాటి గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. వశిష్ట్ మీద బాహుబలి, మగధీరల ప్రభావం ఉంది. ఆ స్ఫూర్తితోనే గెటప్పులు, రాజప్రాసాదం వగైరా డిజైన్ చేయించుకున్నాడు.దీనికీ అదే కీరవాణి సంగీతం అందించడంతో కొంత రిపిటీషన్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎలివేషన్లు బలంగా రాసుకున్న దర్శకుడు దానికి ముందు వెనుకా వచ్చే వాటిని అంతే స్థాయిలో రాసుకోకపోవడం కొంత దెబ్బ తీసింది.
ఇలాంటి జానర్ ఏదైనా ప్రతినాయకుడు బలంగా ఉంటేనే హీరోయిజం తాలూకు డ్రామా బలంగా పండుతుంది. కానీ వశిష్ట ఈ విషయంలో ఎందుకనో అలసత్వం ప్రదర్శించడం బింబిసార అసలు ఉద్దేశాన్ని కొంతమేర దెబ్బ తీసింది. వేసిన ఆర్టిస్టు, ఆ క్యారెక్టర్ ని రాసుకున్న తీరు రెండూ పేలవంగా ఉండటంతో పక్కన సపోర్టింగ్ రోల్ లో నటించిన అయ్యప్ప పి శర్మనే బెటర్ గా అనిపించడం స్క్రిప్ట్ దశలోనే ఆలోచించుకోవాల్సి ఉంది. పైగా ఇంత పెద్ద సెటప్ కి ధన్వంతరి పుస్తకం అనే థ్రెడ్ సరిపోలేదు.అది చదవడం వల్ల పాటించడం వల్ల జబ్బులు నయమవుతాయని చెప్పారు కానీ మృతుంజయులుగా మార్చదు. ఇది ప్రాపర్ గా రిజిస్టర్ కాలేదు.
తెరమీద గ్రాండియర్లకు అలవాటు పడిన జనానికి థియేటర్లకు వచ్చేందుకు బింబిసార దగ్గర వందకు ఓ అరవై కారణాలు ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ రామ్ తో పాటు బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం ట్రై చేయొచ్చు. కాకపోతే ముందే చెప్పినట్టు ఏ బాహుబలి టైపులోనో భీకరమైన యుద్ధాలు, కుట్రలు కుతంత్రాలు ఊహించుకుంటే మాత్రం కష్టం. పైగా త్రిగర్తల రాజ్యం ట్రాక్ నడుస్తున్నంత సేపూ హీరో విలన్ రెండూ కళ్యాణ్ రామే కావడంతో మాస్ కి విలన్ ద్వారా వచ్చే కిక్కు మిస్ అయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ కు బింబిసారుడు తిరిగి రాజ్యంలో ఎంట్రీ ఇచ్చే తీరు ఓ రేంజ్ లో పేలాయి. అవి మినహాయిస్తే మిగిలినవి ఆ స్థాయిలో లేవు
చెడు నుంచి మంచి పరివర్తన చెందే క్రమాన్ని ఫాంటసీ జోడించి చెప్పాలనుకున్న వశిష్ఠ ఆలోచనకు తగ్గట్టు బింబిసార సాగింది. కాకపోతే పాప ఎమోషన్ ని బలంగా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం, బ్యాక్ గ్రౌండ్ లో రిపీట్ గా పాటలు వేయడం లాంటివి కొంత చికాకు పెట్టినప్పటికీ ఫైనల్ గా తనకున్న పరిమితుల్లోనే హీరో దర్శకుడు ఇద్దరూ కలిసి వీలైనంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. ఫలితం రాజమౌళి అంత గొప్పగా వచ్చే అవకాశం లేదు కానీ ఇలాంటి ప్రయత్నాలకు ప్రేక్షకుల నుంచి అంతో ఇంతో ప్రోత్సాహం దక్కితే మరింత జాగ్రత్తగా ఇలాంటివి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా బింబిసార 2 ప్లాన్ చేసుకుంటే.
సంగీత దర్శకుడు కీరవాణి బీజీఎమ్ పరంగా నిరాశపరచలేదు. డాల్బీ సౌండ్ లో బాగానే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కొన్నిచోట్ల అవసరానికి మించి సౌండ్ ఎక్కువయ్యింది. పాటలలో చిత్తరంజన్ భట్ పేరు ఉంది కానీ ఆయన ఏ పాట కంపోజ్ చేశారో క్లారిటీ లేదు. వాసుదేవ్ సంభాషణలు ఇంకొంచెం పదునుగా ఉండాల్సింది. చోటా కె నాయుడు అనుభవం ప్రతి ఫ్రేమ్ ని రిచ్ గా ప్రెజెంట్ చేసింది. తమ్మిరాజు ఎడిటింగ్ మీద మరీ ఎక్కువ కంప్లయింట్స్ లేవు కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్ ని కొంత ట్రిమ్ చేసుంటే బెటరయ్యేది. వెంకట్ రామకృష్ణన్ పోరాటలు బాగున్నాయి. నిర్మాణంలో రాజీ పడనందుకు కళ్యాణ్ రామ్ బృందాన్ని మెచ్చుకోవాలి
ప్లస్ గా అనిపించేవి
కళ్యాణ్ రామ్ నటన
కథా నేపథ్యం
విజువల్ ఎఫెక్ట్స్
టేకింగ్
మైనస్ గా తోచేవి
అంత బలంగా లేని ట్విస్టులు
మెయిన్ విలన్ క్యారెక్టర్
సెకండ్ హాఫ్ పాటలు
ల్యాగ్ అయిన ఎమోషన్
కంక్లూజన్
టాలీవుడ్ గడ్డు పరిస్థితులు ఎదురుకుంటున్న తరుణంలో థియేటర్ కు వెళ్లేందుకు ప్రేక్షకులు స్ట్రాంగ్ కంటెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, విక్రమ్, మేజర్ లు అలవాటయ్యాక మాములు కథలను చూసేందుకు ఇష్టపడటం లేదు. అలాంటి వారికి బింబిసార మంచి ఛాయసే. పెద్దగా అంచనాలు పెట్టుకోనివారికి డీసెంట్ థ్రిల్స్ ఇస్తుంది. విపరీతంగా ఎక్స్ పెక్ట్ చేసిన వారినీ తీవ్రంగా నిరాశపరచదు. కమర్షియల్ అంశాలను పొందుపరుస్తూనే అసలు అనుభవమే లేని వశిష్ట దీన్ని డీల్ చేసిన తీరు కుర్రాడిలో పనితనం ఉందనే ఇంప్రెషన్ ని కలిగిస్తుంది. సో బింబిసార రాజ్యాన్ని ఒకసారి నిక్షేపంగా సందర్శించి రావొచ్చు.
ఒక్కమాటలో – టైంట్రావెల్ తో టైం పాస్
రేటింగ్ – 2.75 / 5