మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ డెరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డు నుంచి కూడా వైదొలుగుతున్నట్టు బిల్‌గేట్స్ ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిల్‌గేట్స్ తెలిపారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్ ద్వారా అభివృద్ధి, విద్య, పర్యావరణ మార్పులపై పోరాడం వంటి దాతృత్వ కార్యక్రమాలకు మరింత కృషి చేయాలని నిశ్చయించుకున్నాననని బిల్ గేట్స్ పేర్కొన్నారు. బెర్క్‌షైర్, మైక్రోసాఫ్ట్ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నందున, సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకోవడానికి ఇదే తగిన సమయంగా భావించినట్టు ఆయన తెలిపారు.
2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన బిల్‌గేట్స్ 2008 నుంచి పూర్తి స్థాయి విధులనుండి తప్పుకున్నారు. 2014లో ఆయన మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ పదవినుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 2014 నుండి బోర్డు సభ్యుడిగా కొనసాగిన బిల్ గేట్స్ ఇప్పుడు దాన్నుండి కూడా తప్పుకున్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల మాట్లాడుతూ, బిల్‌గేట్స్ తో పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయనతో కలిసి పనిచేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నామని అన్నారు.సాఫ్ట్ వేర్ ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో, సమాజంలో సవాళ్ళను పరిష్కరించాలన్న లక్ష్యంతో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ని స్థాపించారని, సంస్థ సలహాదారుడిగా ఆయన వ్యవహరిస్తారని పేర్కొన్నారు.