బీజేపీతో పొత్తుకు నితీష్ కుమార్ మళ్లీ గుడ్ బై, కాసేప‌ట్లో గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం

ఒక‌ప‌క్క మ‌హారాష్ట్ర కేబినెట్ కూర్పులో బీజేపీ త‌ల‌మున‌క‌లైన వేళ‌, బీహార్ లో ఎదురుదెబ్బ త‌గిలింది. మ‌హారాష్ట్రలో త‌ర‌హాలో నితీష్ కుమార్ పార్టీని చీల్చుతారన్న ఊహాగానాల మ‌ధ్య, కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణానికి తెర‌లేచింది. ఈసారి పైఎత్తు నితీష్ కుమార్ దే.

నితీష్ కుమార్ బీహార్‌లో బిజెపితో పొత్తును వ‌ద‌ల‌నుకున్నారు. అధికార JD(U)-BJP కూటమిలో గందరగోళం మధ్య, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలవనున్నారు. ఇప్ప‌టికే, పాట్నాలో జెడి(యు), ప్రతిపక్ష RJD తమ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేశాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ నివాసంలో బీజేపీ సమావేశమైంది.

బీజేపీని రెండోసారి ఢీకొట్టాలనే నిర్ణయానికి రాకముందే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కు రెడీగా ఉండ‌మ‌ని మీడియాకు పార్టీ నేత‌లు ఉప్పందించారుకూడా. అస‌లు బీజేపీని కాద‌నుకోవాల్సిన అవ‌స‌రం ఇప్పుడెందుకు వ‌చ్చింది? రీజ‌న్ ఉంది. జనతాదళ్ (యునైటెడ్)లో చీలికకు కేంద్ర మంత్రి అమిత్ షా అహర్నిశలు కృషి చేస్తున్నారని నితీష్ కుమార్ చేసిన ఆందోళనలపై రెండు పార్టీల మధ్య అగ్గిపుట్టింది.

నితీష్ కుమార్ ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమితంకాలేదు. మ‌హారాష్ట్ర షిండేలా త‌మ పార్టీని నీల్చ‌డానికి త‌మ‌వాడితోనే ఉచ్చుప‌న్నార‌ని, సొంత పార్టీకి చెందిన మాజీ నేత ఆర్‌సిపి సింగ్ ను వేలెత్తి చూపించారు. అమిత్ షాకు అత‌ను తొత్తులా పనిచేశారని తిట్టిపోశారు. అంత‌కుముందే RCP సింగ్ JDU నుండి వైదొలిగారు.

ఎవ‌రీ ఆర్ సీపీ సింగ్? 2017లో RCP సింగ్ నితీష్ కుమార్ పార్టీ త‌రుపున‌ కేంద్ర కేబినేట్ లో చేరారు. క‌నీసం మూడు- నాలుగు ప‌ద‌వుల‌ను ఆశించినా, కేబినెట్‌లో ఒకే ఒక్క స్థానం కల్పించడం పట్ల బీహార్ సీఎం అప్పుడే మనస్తాపానికి గురయ్యారు. అయినా త‌న అసంతృప్తిని బైట‌పెట్ట‌లేదు. ఆ త‌ర్వాత RCP సింగ్ అమిత్ షాకు బాగా ద‌గ్గర‌య్యారు. ఆయ‌నే బీహార్ షిండే అవుతార‌ని చాలా మంది అంచ‌నావేశారు. కాని, తెలివిగ‌ల నితీష్ కుమార్ ముందే మేలుకున్నారు. త‌న పాత‌మిత్రుడి కొడుకుతో కల‌సి కొత్త ప్ర‌భుత్వాన్ని ఎర్పాటుచేయ‌డానికి సిద్ధ‌మైయ్యారు.

ఇక‌, బీహార్‌లో అతిపెద్ద పార్టీ రాష్ట్రీయ జనతాదళ్( RJD) కూడా బీహార్ సంక్షోభంపై చర్చించేందుకు ఈరోజు సమావేశమైంది. ఆ పార్టీకి లాలూ కొడుకు తేజస్వి యాదవ్ అధినేత‌. బీజేపీని కాద‌నుకొంటే క‌ల‌సి ప్ర‌భుత్వాన్ని ఎర్పాటుచేద్దాని ఇంత‌కుముందే తేజ‌స్వి ఆఫ‌ర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అవ‌కాశం వ‌చ్చింది. అంద‌కే నితీష్ కుమార్‌కు తన మద్దతును ప్రకటించాలని భావిస్తున్నారు. అంటే నితీష్ కుమార్ తో ముందునాటి పొత్తును పునరుద్ధరిస్తునట్లే.

జెడి(యు) గవర్నర్‌ను కలిసిన త‌ర్వాత బిజెపి మంత్రుల పేర్లను తొలగించి, మంత్రివర్గంలో ఇతర పార్టీల పేర్లను చేర్చుకునే అవకాశం ఉంద‌న్న‌ది సీఎం వ‌ర్గాల మాట‌. ఇటీవల, బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి నితీష్ కుమార్‌కు RJD మద్దతు ప్ర‌క‌టించింది.

ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ గైర్హాజరవడంతో బీహార్‌లోని ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం బిజెపి, జెడి(యు) మధ్య రాజకీయ విభేదాలు తీవ్రమయ్యాయి. సింగ్ పార్టీకి రాజీనామా చేశారు.

Show comments