Idream media
Idream media
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైన దశలో రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.గత కొంత కాలంగా అధికార ఎన్డీయే సంకీర్ణంలో భాగస్వామ్య పక్షాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కూటమి చీలికకు దారి తీసింది.
తొలుత సీఎం నితీశ్ కుమార్ పాలనపై ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ విమర్శల పర్వానికి దిగడంతో మొదలైన అభిప్రాయభేదాలు తీవ్రరూపం దాల్చాయి.కోవిడ్ -19 నియంత్రణ,వరద సహాయక చర్యలు, వలస కార్మికుల సంక్షోభం మరియు ఉపాధి సమస్యలపై సీఎం నితీశ్ కుమార్ పాలనలో వైఫల్యం చెందాడని ఎల్‌జెపి నాయకత్వం భావిస్తోంది.పైగా బీహార్ ప్రజలు కొత్త ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారని చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉత్తమ ప్రత్యామ్నాయం అని ఎల్‌జెపి ప్రకటించింది.దీంతో పాశ్వాన్ వైఖరిపై రగిలిపోయిన జేడీయూ నేత నితీశ్ కుమార్ ‘ పొమ్మనలేక పొగ పెట్టినట్లు’ ఎల్‌జెపి తమ కూటమిలో లేదని తాము భావిస్తున్నామని ప్రకటించాడు.
ఒంటరి పోరుకు సిద్దమైన ఎల్‌జెపి:
అక్టోబర్ 28న జరిగే తొలి విడత ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలైన వేళ పాలక ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాలు చిచ్చుపెట్టింది. 42 అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్న ఎల్జేపీకి 27 సీట్లు మాత్రమే ఇస్తానని బిజెపి తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి తాము ఎన్నికల పోరాటం చేయడం లేదని ప్రకటించిన ఎల్జేపీ ఎన్డీయే నుంచి వైదొలిగింది.
ఆదివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్డీయే నుంచి వైదొలగాలని ఎల్‌జెపి నిర్ణయించింది.సంకీర్ణం నుండి బయటకి రావడానికి కారణం జేడీయూతో సైద్ధాంతిక విభేదాలేనని ఆ పార్టీ నాయకత్వం పేర్కొనడం గమనార్హం.ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో 143 శాసన సభ నియోజకవర్గాలలో ఒంటరిగా పోటీ చేయాలని ఎల్‌జెపి నిర్ణయించింది.ఎల్జేపీ “బిహార్ ఫస్ట్-బిహారి ఫస్ట్” నినాదంతో సొంతంగా పోటీ చేసి తమ బలం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది.కాగా మాకు జేడీయూతోనే విభేదాలు బీజేపీతో ఎలాంటి సమస్య లేదని చిరాగ్ తాజాగా వ్యాఖ్యానించడం కొసమెరుపు.
జేడీయూకు వ్యతిరేకంగా తమ అభ్యర్ధులను పోటీకి నిలుపుతామని ప్రకటించిన ఎల్‌జెపి బీజేపీతో మాత్రం తమ పొత్తు యధావిధిగా కొనసాగుతుందని ప్రకటించడం విడ్డూరంగా ఉంది.ఎల్‌జెపి ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చిరాగ్ పాశ్వాన్ తెలిపాడు.బిజెపి-ఎల్జేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిన అభివృద్ధి మార్గంలో ముందుకు పయనిస్తుందని పేర్కొన్నాడు.
ఇక చిరాగ్ పాశ్వాన్ ప్రకటన కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఎల్‌జెపి ఒంటరి పోరు నిర్ణయం అధికార ఎన్డీయే విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు.