iDreamPost
android-app
ios-app

3.. 2.. 1.. ఎల్‌జేపీ..!

3.. 2.. 1.. ఎల్‌జేపీ..!

మన గెలుపు కోసం కాకుండా.. ఎదుటివాడి ఓటమి కోసం పని చేస్తే మనకే నష్టం ఎక్కువ అంటారు. ప్రస్తుతం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) పరిస్థితి కూడా ఇలానే తయారైంది. ఈ ఎన్నికల్లో ఎల్‌జేపీ తాను గెలవడంపై కాకుండా జేడీయూ పార్టీ ఓటమిపై దృష్టి పెట్టింది. ఒంటరిగా పోటీ చేసి జేడీయూ అభ్యర్థులు నిలబడిన చోట తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు ఎల్‌జేపీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌.

అనుకున్న లక్ష్యం మేరకు జేడీయూను ఎల్‌జేపీ దెబ్బతీసిదనే విశ్లేషణలు సాగుతున్నాయి. దాదాపు 30 సీట్లలో జేడీయూను ఎల్‌జేపీ దెబ్బకొట్టిందంటున్నారు. అయినా జేడీయూ 43 సీట్లు సాధించింది. బీజేపీ (73) కన్నా తక్కువ సీట్లు వచ్చినా ఆ పార్టీ చీఫ్‌ నితీష్‌కుమార్‌ మరో మారు సీఎం పీఠం ఎక్కబోతున్నారు.

అయితే నితీష్‌ను దెబ్బకొట్టేందుకు యత్నించిన చిరాగ్‌ పాశ్వాన్‌ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టపోయిన మాదిరిగా తయారైంది. చిరాగ్‌ పార్టీ బిహార్‌లో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచి ఉనికి కాపాడుకుంది. ఈ ఒక్క సీటు కూడా గెలకపోయి ఉంటే.. ఆ పార్టీ ఏర్పాటు తర్వాత బిహార్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కని ఎన్నికలుగా చిరాగ్‌ పాశ్వాన్‌కు గుర్తిండిపోయేవి.

ఎన్నికలకు కొద్ది రోజులు ముందే ఎల్‌జేపీ వ్యవస్థాపకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ అనారోగ్యంతో చనిపోయారు. అంతకు ముందే పార్టీ పగ్గాలను ఆయన తన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు అప్పజెప్పారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం అంతా చిరాగ్‌ పాశ్వాన్‌ చేతి నుంచే నడిచింది. రాం విలాస్‌ పాశ్వాన్‌ మరణం తాలుకూ సానుభూతి ఎల్‌జేపీ అభ్యర్థులపై ఉంటుందని భావించారు. కానీ ఇలాంటిదేమీ కనిపించలేదు.

దాదాపు 20 ఏళ్ల నుంచి బిహార్‌లో రాజకీయాలు చేస్తున్న ఎల్‌జేపీ.. తన ప్రాభవాన్ని క్రమేపీ కోల్పోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్‌ 2000లో ఎల్‌జేపీని రాం విలాస్‌ పాశ్వాన్‌ స్థాపించారు. మొదటిసారి 2005 బిహార్‌ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. 243 సీట్లకు గాను 179 చోట్ల పోటీ చేయగా 29 సీట్లు గెలుచుకుంది. అయితే ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాకపోవడం, పొత్తు కుదరకపోవడంతో అదే ఏడాది అక్టోబర్‌లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ ఎల్‌జేపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఫిబ్రవరిలో వచ్చిన ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో ఈ సారి 203 స్థానాల్లో ఎల్‌జేపీ తన అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఈ సారి బిహారీలు ఎల్‌జేపీని పది సీట్లకే పరిమితం చేశారు.

2005 తర్వాత మళ్లీ ఈ సారే ఎల్‌జేపీ ఒంటరిగా పోటీ చేసింది. 2010లో ఆర్‌జేడీతో పొత్తు పెట్టుకుని మూడు సీట్లు గెలుచుకుంది. 2015లో ఎన్‌డీఏలో భాగస్వామిగా పోటీ చేసి రెండు సీట్లలో విజయం సాధించింది. ఈ సారి ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటుకే పరిమితం అయింది. సీట్ల పరంగా ఎల్‌జేపీ ప్రస్థానం పరిశీలిస్తే.. క్రమేపీ తగ్గుతూ.. ఆ పార్టీ బిహార్‌ అసెంబ్లీలో ప్రాతినిథ్యమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది.