iDreamPost
iDreamPost
తలైవా రజనీకాంత్ ఇటీవలే తాను తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే..! రజనీ పొలిటికల్ ఎంట్రీతో తమిళ రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని విశ్లేషకులు భావిస్తున్న సమయంలో అక్కడ ఇప్పటిదాకా అధికారం చెలాయిస్తూ వచ్చిన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ పొలిటికల్ ఎంట్రీని అడ్డుకునేందుకు చాటా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.
తాజాగా సీనియర్ కోలీవుడ్ దర్శకుడు భారతీరాజా రజనీపై చేసిన నాన్‌లోకల్ విమర్శలు ఈ కోవలోకే వస్తాయని చెప్పాలి. సూపర్ స్టార్ రజినీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రజినీ నాన్ లోకల్ అని, విశ్వాసఘాతుకానికి అతను నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ వ్యక్తులు కానివారు రాష్ట్రాన్ని పాలించేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
నిజానికి రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మహారాష్ట్ర మూలాలున్న కుటుంబంలో కర్నాటకలో జన్మించిన రజనీకాంత్ మూడున్నర దశాబ్దాలుగా తమిళ చిత్రరంగంలో స్టార్ హీరోగా తిరుగులేని ప్రేక్షకాదరణతో కొనసాగుతున్నారు. ఇక తమిళనాట ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కుటుంబానికి తెలుగు మూలాలున్నాయి. అలాగే దివంగత ముఖ్యమంత్రి జయలలిత పూర్వీకులు కర్నాటకకు చెందినవారు. ఈ నేపథ్యంలో కేవలం రజనీపై మాత్రమే కావాలని చేస్తున్న విమర్శలు రాజకీయపరమైనవేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి తానూ రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన మరో అగ్రనటుడు కమల్‌హాసన్ ఈ విషయంపై తన స్టాండ్ ఏమిటో ప్రకటించాల్సి ఉంది