iDreamPost
android-app
ios-app

నేడు భారత్ బంద్ – మూతపడిన విద్యాసంస్థలు, వాయిదాపడిన పరీక్షలు, 144 సెక్షన్ అమలు

  • Published Jun 20, 2022 | 9:54 AM Updated Updated Jun 20, 2022 | 9:54 AM
నేడు భారత్ బంద్ – మూతపడిన విద్యాసంస్థలు, వాయిదాపడిన పరీక్షలు, 144 సెక్షన్ అమలు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మొదలైన ఈ ఆందోళనలు క్రమంగా అన్ని రాష్ట్రాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభ్యర్థులు హింసాకాండను సృష్టించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు, ఆందోళనల్లో భాగంగా నేడు భారత్ బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్ కు పిలుపునివ్వగా.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సోమవారం జార్ఖండ్ లో అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బంద్ కారణంగా ప్రస్తుతం జరుగుతోన్న 9,11తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. బీహార్ లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండటంతో 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పంజాబ్ లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అలర్టయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లోనూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జైపూర్, నోయిడాలలో 144 సెక్షన్ విధించారు. తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపిస్తోంది.