iDreamPost
iDreamPost
రెండేళ్ల క్రితం విడుదలైన అనుష్క భాగమతి కథ విషయంలో కొంత రొటీన్ గానే అనిపించినా స్వీటీ పెర్ఫార్మన్స్, దర్శకుడు అశోక్ టేకింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఎలివేట్ అయ్యింది. దానికి తోడు జయరాం లాంటి సీనియర్ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కు దీన్ని ఇంకో స్థాయిలో నిలబెట్టాయి. అప్పటి నుంచి ఇతర భాషల్లోనూ దీని రీమేక్ మీద చాలా ప్రయత్నాలు జరిగాయి. హిందీ డబ్బింగ్ వెర్షన్ యుట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్నప్పటికీ అక్కడ మళ్ళీ పునఃనిర్మించారు. దుర్గామతి టైటిల్ తో నిన్న రాత్రి అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ఓటిటి రిలీజ్ చేసుకున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.
కానీ అక్షయ్ కుమార్ కాంచన రీమేక్ లక్ష్మిలో ఏవైతే పొరపాట్లు చేశాడో ఇంచుమించు అదే తరహాలో దుర్గామతిలోనూ రిపీట్ అయ్యాయి. టైటిల్ రోల్ పోషించిన భూమిక పెడ్నేకర్ టాలెంటెడ్ నటే అయినప్పటికీ అనుష్కను కనీసం సగం కూడా మ్యాచ్ చేయలేకపోయింది. నిజానికి ఇలాంటి టెర్రిఫిక్ రోల్ కు తను సూట్ కాలేదు. ముఖ్యంగా బంగాళాలో దుర్గామతిగా మారే సన్నివేశాలలో తేలిపోయింది. తెలుగులో అనుష్క యాక్టింగ్ తో పాటు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ వాయిస్ అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి. కానీ దుర్గామతిలో మిస్ అయ్యింది ఇదే. పైగా భూమి రూపం కూడా అంతగా ఆకర్షణీయంగా అనిపించకపోవడం మరో మైనస్.
ఒరిజినల్ వర్షన్ డీల్ చేసిన అశోకే దీనికి కూడా దర్శకుడు కావడంతో ఏ ఒక్క సీన్ ని మార్చకుండా యధాతధంగా కాపీ పేస్ట్ చేయడంతో నిడివి కూడా ఎక్కువయ్యింది. మెయిన్ విలన్ గా చేసిన అర్షద్ వార్సి తన సీనియారిటీని చూపించినప్పటికీ మహి గిల్ తో సహా మిగిలిన పాత్రలు తేలిపోయాయి. భాగమతి చూసిన వాళ్ళు దుర్గామతిని భరించలేరు. చూడనివాళ్లకు సైతం చాలా చోట్ల బోర్ కొట్టేలా కథనం సాగింది. కొంత క్రిస్పీగా స్క్రీన్ ప్లేని మార్చుకుని ఉంటే వేగం పెరిగి విసుగు తగ్గేది. కానీ దుర్గామతి కోసం అశోక్ ఎలాంటి రిస్క్ చేయలేదు. ఫలితంగా ప్రైమ్ వ్యూస్ వస్తాయేమో కానీ రిపోర్ట్స్ పరంగా మరో డిజాస్టర్ తప్పేలా లేదు.