కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు ఇది ఒకరకంగా శుభవార్తే. ఎందుకంటే ట్రాఫిక్ అనగానే బెంగళూరు, హైదరాబాద్ ఎలా గుర్తు వస్తాయో, ఏపీ విషయానికి వస్తే విజయవాడ అనగానే ట్రాఫిక్ గుర్తుకు వస్తుంది. విజయవాడలో బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్- 2 నిర్మాణం కూడా పూర్తయిన నేపథ్యంలో బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు ఇకపై తీరబోతున్నాయి. బెంజ్-2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది. ఈ మేరకు శనివారం ఉదయం ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వారం పాటు రాకపోకలకు అనుమతులు ఇచ్చాక ఈనెల 14వ తేదీన అధికారికంగా ప్రారంభిస్తారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌గా ప్రారంభించే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొనే అవకాశముంది.
విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ వర్ణనాతీతం. ఎందుకంటే ఇక్కడ రెండు హైవేలు కలుస్తాయి. దీంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారం. దానికి తోడు విజయవాడ కేంద్రంగానే దాదాపు ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే మొదటి ఫ్లైఓవర్ పూర్తయిపోయి రాకపోకలు కూడా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత రెండో వైపు ఫ్లైఓవర్ నిర్మాణ బాధ్యతలు హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు పొందిన సంస్థ వెంటనే పనులు ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్-2 నిడివి 1.4 కిలో మీటర్లు. మొత్తం 224 భూగర్భ పిల్లర్లు, 56 పిల్లర్లు, 220 గడ్డర్లు, 56 స్పాన్లు, శ్లాబులతో ఈ ఫ్లై ఓవర్ రూపుదిద్దుకుంది. అయితే బెంజిసర్కిల్-2 ఫ్లై ఓవర్ శరవేగంగా రూపుదిద్దుకుని రికార్డు సృష్టించగా ఈ మేరకు కాంట్రాక్టు సంస్థకు బోనస్‌తో పాటు అవార్డు కూడా లభించే అవకాశాలున్నాయి. రెండేళ్ల గడువు గానూ 16 నెలల్లోనే కాంట్రాక్టు సంస్థ పూర్తి చేయడం విశేషం. నగరంలో జనావాసాలకు ధ్వని కాలుష్యం లేకుండా ఫ్లై ఓవర్ ని నిర్మించారు. ఇక ఇదే పని కనుక బాబు హయాంలో జరిగి ఉంటే ఫ్లై ఓవర్ నిర్మాణంలో సగం ప్రచారానికి వాడి ఉండేవారు. కానీ ఇది జగన్ సర్కార్ కావడంతో మాటలు తక్కువ పని ఎక్కువ కదా.. ఇవేం పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటారు.
Also Read : Indian Navy – AP Executive Capital : ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖ.. గుర్తించిన ఇండియన్ నేవీ