iDreamPost
android-app
ios-app

బెంగాల్ చీఫ్ మార్పు బీజేపీకి లాభిస్తుందా?

బెంగాల్ చీఫ్ మార్పు బీజేపీకి లాభిస్తుందా?

ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయ ప‌రిణామాల‌పై బీజేపీ లో గుబులు మొద‌లైందా? టీఎంసీలోకి వ‌ల‌స‌ల నేప‌థ్యంలో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకుంటోందా? అంటే అవును అన్న‌ట్లుగానే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఆరు నెల‌ల కాలంలో న‌లుగురు ముఖ్య‌మంత్రుల‌ను మార్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌శ్చిమ బెంగాల్ లో మాత్రం రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడిని మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాల నేప‌థ్యంలోనే బీజేపీ ఈ చ‌ర్య‌లు తీసుకుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు ఎంత హోరాహోరీగా జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. టీఎంసీ, బీజేపీ యుద్ధాన్ని చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీతో గ‌ట్టిగానే పోరాడినా ఆశించిన స్థాయిలో ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. బంప‌ర్ మెజార్టీతో టీఎంసీ అధికారంలోకి వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. ఫ‌లితాల అనంత‌రం ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. బీజేపీని వీడేందుకు చాలా మంది నేత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. కొంద‌రైతే.. ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరి త‌ప్పు చేశాం.. మ‌ళ్లీ మ‌మ్మ‌ల్ని టీఎంసీలో చేర్చుకోండి అంటూ.. మైకులు పెట్టి మ‌రీ ప్ర‌చారం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

Also Read: సీఎంలను మారిస్తే ఎన్నికల్లో గెలుస్తారా?గతంలో గెలిచారా?

టీఎంసీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. వరుసగా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్‌బై చెప్పి.. మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేర‌డం మొద‌లైంది. ఇప్పటికే బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టీఎంసీలో చేరారు. మ‌రి కొంత మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో బీజేపీ అధిష్ఠానం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. బెంగాల్‌ బీజేపీ చీఫ్‌గా ఉన్న దిలీప్ ఘో‌ష్‌పై వేటు వేసింది. ఆయన స్థానంలో ఎంపీ సుకంత మజుందర్‌ను నియమించింది. కాగా, బెంగాల్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడ‌డంతో దిలీప్ ‌ఘోష్‌పై పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప‌లువురు ఆరోపణలు గుప్పించారు.. ఈ తరుణంలోనే అధిష్టానం ఆయనపై వేటు వేసిన‌ట్లుగా తెలుస్తోంది.

బీజేపీ చీఫ్ మార్పు అనివార్య‌మ‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచీ ఆ స్థానంలోకి సువేందు అధికారిని నియమిస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్ష నేతగా ఉన్నగా సువేందును కాకుండా ఎంపీ సుకంత మజుందర్‌ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. మమతా బెనర్జీ ని మ‌హా కూట‌మి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని దిలీప్ ఘోష్ గ‌తంలో వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని అభ్యర్థిని పశ్చిమ్‌బెంగాల్ నుంచి ఎన్నుకుంటే.. మమతానే ఉత్తమ ఎంపిక. ప్రధాని కావాలని ఆమె కలలు కంటున్నారు. ఆమెకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నా. అయితే వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడతారు’ అని ఘోష్‌ వ్యాఖ్యానించారు.

Also Read: ముఖ్యమంత్రులతో జాతీయ పార్టీల బంతులాట

ఇటీవలే బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో కూడా తాజాగా అవే వ్యాఖ్య‌లు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారని పేర్కొన్నారు. ‘మన పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ 2024లో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కీలక పాత్ర పోషిస్తుంది.వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని రేసులో మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారన్నది ఎవరూ కాదనలేరు.’ అని బాబుల్ సుప్రియో పేర్కొన్నారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ.. పార్టీ మారడం ద్వారా తానేమీ చరిత్ర సృష్టించలేదని సుప్రియో అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంతోమంది నేతలు టీఎంసీని వీడి బీజేపీలో చేరారని గుర్తుచేశారు. ఇప్పటికీ బీజేపీ సీనియర్ నేతల్లో పార్టీపై తీవ్ర ఆగ్రహం ఉందని… ఆ కారణమేంటో బీజేపీ తెలుసుకోవాలని సూచించారు. ఈ సూచ‌న‌ల‌పై కూడా పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు బీజేపీ చీఫ్ మార్పు పార్టీకి ఎంత వ‌ర‌కు లాభిస్తుందో చూడాలి.

Also Read: అఖాడా పరిషత్ మహంత్ నరేంద్ర గిరి,సహజ మరణమేనా?