iDreamPost
iDreamPost
ప్రతి ఒక్కరికి అమ్మానాన్న అన్నా చెల్లి అక్కా తమ్ముడు భార్య భర్తకు మించిన బంధాలు ఉండకపోవచ్చు. కానీ వాటితో ముడిపడిన లేదా వాళ్ళతో బంధుత్వం కలిగిన కొందరు మన జీవితంతో ఎంతగా ముడివేసుకుంటారో ఊహించడం కష్టం. వీళ్ళ మధ్య ఏర్పడే ఎమోషన్ తో కుటుంబ ప్రేక్షకులను అలరించేలా గొప్ప కథలను రాసుకుని సినిమాలుగా చూపిస్తే ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. దానికి మంచి ఉదాహరణ బావ బావమరిది. దాని విశేషాలు చూద్దాం. 1992లో తమిళంలో ప్రభు ఖుష్బూ జంటగా వచ్చిన ‘పాండితురై’ ఆ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దాన్ని రీమేక్ చేసే ఉద్దేశంతో హక్కులు కొన్నారు నిర్మాత ఎడిటర్ మోహన్.
అప్పటికాయన మరో రీమేక్ ‘మామగారు’ రూపంలో అంతకు ముందు సంవత్సరం మంచి సక్సెస్ అందుకున్నారు. తమిళ సినిమాల్లో ఉండే విలేజ్ ఎమోషన్స్ సరిగ్గా ప్రెజెంట్ చేస్తే ఇక్కడ అంతకు మించిన ఫలితాన్ని అందుకోవచ్చనే ఆలోచనతో ఎక్కువ ఆలోచన చేయకుండా రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ లో బావ క్యారెక్టర్ చేసిన రాధా రవి క్యారెక్టర్ ఆర్టిస్టు. ఇక్కడ అలా కాకుండా కథలో కొన్ని కీలక మార్పులు చేసి ఆ పాత్రకు హుందాతనం జోడించి చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో రచయిత రాజేంద్ర కుమార్, దర్శకుడు శరత్ తో కలిసి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాక కృష్ణంరాజుని కలిశారు.
హీరో హీరోయిన్లుగా సుమన్, మాలాశ్రీని ఎంపిక చేశాక తనదగ్గరికొచ్చిన ప్రతిపాదన చూసి కృష్ణంరాజు మొదట సంశయించారు. కానీ అసలు సినిమాతో పోలిక రాకుండా తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు చేసిన మార్పులు బాగా నచ్చాయి. జోడిగా జయసుధని చెప్పడంతో ఇంకేమి ఆలోచించలేదు. అరవంలో వ్యాంప్ గా చేసిన సిల్క్ స్మితని ఇక్కడా రిపీట్ చేశారు. కోట బాబూమోహన్ లకోసం ప్రత్యేక కామెడీ ట్రాక్ రాసుకున్నారు. రాజ్ కోటి పాటలు చప్పట్లు కొట్టే స్థాయిలో వచ్చాయి. ఫ్యామిలీ సినిమాలో ఐటెం సాంగ్ బ్లాక్ బస్టర్ కావడం ఒక చరిత్ర. ఇప్పటికీ ‘బావలు సయ్యా మరదలు సయ్యా’ పాట ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. 1993 జూన్ 4 రిలీజైన బావ బావమరిది సరిగ్గా వారం ముందు రిలీజైన చిరంజీవి ‘మెకానిక్ అల్లుడు’ని ఓవర్ టేక్ చేసి మరీ ప్రేక్షకులను మెప్పించింది.