iDreamPost
iDreamPost
పాలనా వికేంద్రీకరణకు కట్టుబడిన వైఎస్ జగన్ అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ హయంలో మండల కేంద్రాలకు పరిమితమయిన అభివృద్ధిని గ్రామ సీమలకు విస్తరిస్తున్నారు. ప్రతీ 2వేల జనాభాకి ఒకటి చొప్పున ఏర్పాటయిన గ్రామ సచివాలయాల ద్వారా సమగ్ర సేవలందించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్ని సేవలు అందుబాటులోకి రావడం గ్రామాల అభివృద్ధికి బాటలు వస్తోంది. పల్లె వాసులకు ఎంతో ఊరట, ఉపశమనం కలిగిస్తోంది. ఇక త్వరలో విలేజ్ క్లినిక్కులు వంటివి కార్యరూపం దాలిస్తే ఆరోగ్య సేవల్లోనూ అద్భుతమైన ఫలితాలు అనివార్యం అని చెప్పవచ్చు.
తాజాగా ప్రభుత్వం రైతు భరసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించాలని వివిధ బ్యాంకులకు చేసిన సూచన కార్యరూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10,413 మంది కరస్పాండెంట్లు అందుబాటులోకి వచ్చారు. అందులో ఎస్బీఐ తరుపున 3289 మంది, యూనియన్ బ్యాంకు తరుపున 1320, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ తరుపున 1091, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 990, కెనరా బ్యాంకు 830 మంది చొప్పున నియమించాయి. ఇకపై అందరూ ఆర్బీకేలలో అందుబాటులో ఉంటారు. ఆయా గ్రామాల్లో రైతులకు పథకాల ద్వారా చేకూరుతున్న లబ్ది సకాలంలో అందించేందుకు తోడ్పడతారు. అదే సమయంలో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చిన్న మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకునే సదుపాయం కూడా అందిస్తారు. బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన పెంచుతూ, అవసరమైన అన్ని సదుపాయాలు అందిస్తారు. త్వరలోనే పూర్తిస్థాయి బ్యాంకింగ్ ఏర్పాట్లు కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రైతు తన సమీపంలోని బ్యాంకుకి వెళ్లాలంటే ఒకరోజు పని నష్టం. అదే సమయంలో ఆర్థికంగానూ భారం. ఇప్పుడు ఆయా గ్రామాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉండడం వల్ల పని, డబ్బులు నష్టం లేకుండా సులువుగా పనులు పూర్తి చేసుకోవచ్చు. పంట రుణం లాంటి వాటి కోసం సామాన్య రైతులు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇకపై అలాంటి అవసరం ఉండదు. స్వగ్రామంలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకునే అవకాశం వస్తోంది.
ఇప్పటికే ఆర్బీకేలలో ఏర్పాటు చేసిన సాంకేతిక కియోస్కుల ద్వారా రైతులకు అనేక అంశాలలో అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఎరువులు, పరుగు మందులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాలకు కూడా కేంద్రంగా మార్చడం ద్వారా వివిధ బ్యాంకులకు సంబంధించిన బ్రాంచీలు అందుబాటులో లేని ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతోంది. మారుమూల గ్రామాలకు ఇది మెరుగైన సదుపాయాలకు అవకాశం ఇస్తోంది. అదే సమయంలో బ్యాంకుల ముందు క్యూలు కట్టాల్సిన అవసరం తగ్గిస్తుంది. మొత్తంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పల్లెల్లో ప్రగతికి కొత్త బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : బాబుని బజారున పడేసిన బుచ్చయ్య