iDreamPost
android-app
ios-app

బాలయ్య యాక్షన్ పరుచూరి డైరెక్షన్ – Nostalgia

  • Published Dec 02, 2020 | 12:05 PM Updated Updated Dec 02, 2020 | 12:05 PM
బాలయ్య యాక్షన్ పరుచూరి డైరెక్షన్ – Nostalgia

సుప్రసిద్ధ రచయితలు దర్శకులుగా మారడం కొత్తేమి కాదు కానీ అందులో విజయం సాధించిన వాళ్ళు తక్కువే. త్రివిక్రమ్ శ్రీనివాస్, జంధ్యాల లాంటి వాళ్ళు మాత్రమే తమ కత్తికి రెండు వైపులా పడనుందని ఋజువు చేసుకున్నారు. అయితే తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ కొన్ని ప్రత్యేక అధ్యయాలు రాసుకుని ఎన్నో చరిత్ర సృష్టించిన చిత్రాలకు తమ కలంతో బలంగా నిలిచిన పరుచూరి బ్రదర్స్ మాత్రం కెప్టెన్లుగా వ్యవహరించే క్రమంలో మరీ గొప్ప విజయాలు సాధించలేకపోయారు. సర్పయాగం లాంటి ఒకటి రెండు మినహాయిస్తే ఈ ద్వయం దర్శకులుగా చేసిన సినిమాలు సక్సెస్ లు రెండూ తక్కువే.

వీటిలో నందమూరి బాలకృష్ణతో కూడా ఓ మూవీ చేశారంటే బహుశా ఇప్పటి యూత్ ఫ్యాన్స్ కి అంతగా అవగాహన ఉండకపోవచ్చు. 1985లో బాలయ్య హీరోగా భలే తమ్ముడు వచ్చింది. అన్నగారి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ టైటిల్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ పరుచూరి బ్రదర్సే చేసుకున్నారు. చక్రవర్తి సంగీతం అందించగా దేవరాజ్ ఛాయాగ్రహణం సమకూర్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ హిట్ అడవి రాముడు నిర్మించిన సత్య చిత్ర బ్యానర్ పై భలే తమ్ముడు రూపొందింది.ఇప్పటి పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఊర్వశి హీరోయిన్ గా నటించింది.

ఇందులో బాలయ్య పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కనిపిస్తాడు. అన్నయ్య చంద్రమోహన్ అదే స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్. సంఘ విద్రోహ శక్తుల వల్ల ఆనందంగా ఉన్న వీళ్ళ కుటుంబంలోకి అగాధం తొంగిచూస్తుంది. ముగ్గురు విలన్లు ఉంటారు. అన్నకొడుకు వీళ్ళ వల్లే ప్రాణాలు కోల్పోతాడు. మరి వీటిని దాటుకుని హీరో భలే తమ్ముడని ఎలా అనిపించుకున్నాడు అనేదే అసలు స్టోరీ. అప్పటి కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా పరుచూరి సోదరులు అన్నీ సమకూర్చి భలేతమ్ముడుని రూపొందించారు. అయితే విపరీతమైన అంచనాలను అందుకోలేక యావరేజ్ కు ఓ మెట్టుపైన నిలిచింది. ఓ పెద్ద స్టార్ హీరోతో ఈ సోదర రచయితలు దర్శకత్వం చేసిన సినిమా భలే తమ్ముడు ఒక్కటే.