iDreamPost
iDreamPost
ఇప్పుడంతా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ పాత సినిమాల రీ రిలీజుల ట్రెండ్ ఊపందుకుంటోంది. కేవలం ఒకటి రెండు సెంటర్లకు పరిమితం చేయకుండా అన్ని ప్రధాన కేంద్రాల్లో షోలు వేస్తన్నారు. ఆ మధ్య ఘరానా మొగుడుకు రెస్పాన్స్ బాగానే వచ్చింది కానీ ప్రింట్ లో లోపాల వల్ల నెగటివ్ ఫీడ్ బ్యాక్ నూ మూటగట్టుకుంది. ఒక్కడు పరిమితంగా దుమ్ము దూలపగా పోకిరి ఏకంగా 1 కోటి 70 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేమేం తక్కువా అని జల్సాతో ఏకంగా 3 కోట్లకు పైగా లెక్క రాబట్టి ఆమ్మో అనిపించారు. అసలు కొత్త సినిమాలే అలో లక్ష్మణా అంటుంటే వీటికి హౌస్ ఫుల్ బోర్డులు పడటం మాత్రం అనూహ్యం.
ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. ఈ నెల 24, 25 తేదీల్లో చెన్నకేశవరెడ్డిని స్పెషల్ ప్రీమియర్లు వేయబోతున్నారు. 2002లో వచ్చిన ఈ ఫ్యాక్షన్ డ్రామా అప్పట్లో యావరేజ్ గానే ఆడింది. కమర్షియల్ గా కొన్ని చోట్ల లాభాలు ఇవ్వగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సరసన నిలవలేకపోయింది. కథనం విషయంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల దీన్ని గొప్ప ల్యాండ్ మార్క్ మూవీగా నిలిపే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని దర్శకుడు వివి వినాయక్ పలు సందర్భాల్లో చెప్పడం అభిమానులకు గుర్తే. అప్పుడంటే విపరీతమైన అంచనాల మధ్య నలిగిపోయింది కానీ దాంట్లో అభిమానులకు కావాల్సిన మాస్ స్టఫ్ బోలెడుంటుంది.
అమెరికా, ఆస్ట్రేలియా, యుకె తదితర దేశాలతో పాటు ఏపీ తెలంగాణలోనూ స్పెషల్ షోలు పడబోతున్నాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో బుకింగ్స్ ఆల్రెడీ ఊపందుకున్నాయి కూడా. టబు, శ్రేయ, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, ఆహుతి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించిన చెన్నకేశవరెడ్డికి మణిశర్మ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయువుపట్టు. దానికోసమే చూసే వాళ్ళున్నారు. ఈ ట్రెండ్ ఇక్కడితో ఆగడం లేదు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని వర్షం, బిల్లా షోల కోసం ప్లానింగ్ జరుగుతోంది. ఇంకా బోలెడు హీరోలు వాళ్ళ బర్త్ డేలు రాబోతున్నాయి కాబట్టి అందరి వంతు వచ్చేస్తుంది.