హానీ ట్రాప్.. బ్యాంక్ మేనేజర్ నుంచి 5.81కోట్లు స్వాహా..

టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందులోను ఇటీవల బాగా వినబడుతున్న పేరు హానీ ట్రాప్. డేటింగ్ యాప్ ల పేరుతో కొందరు మహిళలు, కొంతమంది మహిళా అకౌంట్స్ తో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ మహిళ మాటలు నమ్మి ఓ బ్యాంక్ మేనేజర్ రూ.5.81కోట్లు పోగొట్టుకున్నాడు.

బెంగళూరు హనుమంతనగర్ లోని ఓ బ్యాంకులో హరిశంకర్ మేనేజరుగా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఓ డేటింగ్ యాప్ లో రిజిస్ట్రర్ అయ్యాడు. కొద్దిరోజుల తరువాత ఆ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. రోజు యాప్ ద్వారా మాట్లాడుకోవటం, వీడియోకాల్స్, మెస్సేజ్ ల ద్వారా మరింత దగ్గరయ్యారు. ఆ యువతి తన ట్రాప్ లో పడేసుకుంది బ్యాంక్ మేనేజర్ ని. ఈ క్రమంలో ఓ వ్యాపారం చేయాలనుకుంటున్నాను పెట్టుబడి పెట్టమని, కష్టాల్లో ఉన్నాను అని అడిగింది. మొదట హరిశంకర్ ఒప్పుకోకపోయినా ఆ యువతి మాయమాటలు చెప్పి నమ్మించింది.

దీంతో హరిశంకర్ ఆ యువతిని నమ్మి మొదట 12లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత మరింత కావాలని అడగడంతో ఏ సారి ఏకంగా తన బ్యాంక్ లోని పెద్ద మొత్తంలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన అనిత అనే సీనియర్ సిటిజన్ ఖాతాపై రూ. 6కోట్లు రుణాన్ని తన పేరిట తీసుకొని తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అందులోంచి రూ.5.69కోట్లను యువతి అకౌంట్ కు బదిలీ చేశాడు. ఆ తరువాతి రోజు నుంచి యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ క్రమంలో రుణానికి సంబంధించి అనిత ఫోన్ కు మెస్సేజ్ లు వెళ్లడంతో ఆమె బ్యాంక్ కు వచ్చి పై అధికారులకి కంప్లైంట్ ఇవ్వడంతో హరిశంకర్ ఈ పని చేసాడని తెలిసి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ ను పోలీసులు అరెస్టు చేయగా జరిగిందంతా చెప్పాడు.

ఆ డబ్బును పశ్చిమ బెంగాల్ లోని 28 ఎకౌంట్లకు తరలించినట్టు, 6 రోజుల వ్యవధిలో విడతల వారీగా ఈ లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. హరిశంకర్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని ఆ 28 ఎకౌంట్లను ఫ్రీజ్ చేసే పనిలో పడ్డారు. అయితే అప్పటికే వాటిల్లో చాలా ఎకౌంట్లలో డబ్బుని విత్ డ్రా చేసేశారు.

 

 

 

 

 

Show comments