iDreamPost
android-app
ios-app

బద్వేలు కు సేవ‌లందించ‌నున్న మ‌రో డాక్ట‌ర్‌?

బద్వేలు కు సేవ‌లందించ‌నున్న మ‌రో డాక్ట‌ర్‌?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. బ‌ద్వేల్, హుజురాబాద్ లో నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో 26 నామినేషన్లు దాఖలు కాగా.. ఆంధ్రప్రదేశ్‎లోని కడప జిల్లా బద్వేల్‎లో 35 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబ‌ర్ ప‌ద‌కొండున స్క్రూటీని అనంత‌రం ఎంత మంది బ‌రిలో నిలిచేది తేల‌నుంది. కాగా.. బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చి పోటీలో ఎంద‌రు మిగిలిన కానీ.. వైసీపీ అభ్య‌ర్థి గెలుపు లాంఛ‌నం కానుంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన పోటీ నుంచి త‌ప్పుకున్నాయి. వైసీపీ నెగ్గితే.. బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జాప్ర‌తినిధిగా సేవ‌లందించే జాబితాలో మ‌రో డాక్ట‌ర్ చేర‌నున్నారు.

బద్వేలు శాసన సభ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికలో ఇద్దరు వైద్యులు ఈ శాసనసభకు, ఎ‍మ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌ చదివిన డాక్టర్‌ శివరామక్రిష్ణయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటి పర్యాయం 1978లో జనతాపార్టీ తరపున 10,187 ఓట్లతో, రెండో పర్యాయం కాంగ్రెస్‌ తరపున 10,001 మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్య వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా 44,7354 ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. ఈయన ఎంబీబీఎస్‌,ఎంఎస్‌ ఆర్థోపెడిక్‌ చదివారు. ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ తరపున డాక్టర్‌ సుధా పోటీలో ఉన్నారు. ఈమె ఎంబీబీఎస్‌ చదివి గైనకాలజిస్ట్‌గా వైద్య సేవలందిస్తున్నారు.

డాక్టర్‌ వెంకట సుబ్బయ్య, డాక్టర్‌ సుధ భార్యభర్తలు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ప్రస్తుత.. ఉప ఎన్నికలో ఆయన భార్య సుధా నామినేషన్‌ వేశారు. టీడీపీ, జనసేన పార్టీలు పోటీచేయమని ప్రకటించాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం సుధ ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. వైసీపీ తరపున దాసరి సుధ, కాంగ్రెస్‌ తరపున కమలమ్మ, బీజేపీ తరపున పంతల సురేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ, కాంగ్రెస్ ల‌కు అస్స‌లు బ‌లం లేదు. గ‌త ఎన్నిక‌ల ఫలితాల‌ను ప‌రిశీలిస్తే ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. అయిన‌ప్ప‌టికీ ఉనికి కోసం ఆ పార్టీలు బ‌రిలో నిలిచిన‌ట్లు తెలుస్తోంది. నామినేష‌న్ల ప‌ర్వం ముగియ‌డంతో ఇక ప్ర‌చారంలో ఎలా ముందుకెళ్తార‌నేది ఆస‌క్తిగా మారింది.