iDreamPost
android-app
ios-app

బద్వేలు ఉప ఎన్నిక – బీజేపీ అభ్యర్థి ఖరారు

బద్వేలు ఉప ఎన్నిక – బీజేపీ అభ్యర్థి ఖరారు

వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోయోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ రోజు అభ్యర్థిని ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన పనతాల సురేష్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు జాతీయ పార్టీ విడుదల చేసిన ఉప ఎన్నికల జాబితాలోని పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. నామినేషన్ల దాఖలుకు రేపు శుక్రవారంతో గడువు ముగుస్తుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించాయి. కాంగ్రెస్‌పార్టీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మను ప్రకటించింది.

Also Read : ఆ విషయం తెలియదు.. ప్రచారానికి పవన్‌ను పిలుస్తామంటున్న సోము

కడప నగరానికి చెందిన సురేష్‌.. బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నాయకుడిగా 14 ఏళ్లు పని చేశారు. గత రెండేళ్ల నుంచి బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. బద్వేలు ఉప ఎన్నికల నేపథ్యంలో.. పనతాల సురేష్‌ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. బద్వేలులో అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై బీజేపీ సుదీర్ఘ కసరత్తే చేసింది. ఐదుగురు పేర్లను పరిశీలించింది. అందులో మాజీ ఎమ్మెల్యే జయరాములు, పనతాల సురేష్‌లలో ఒకరిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే చివరకు బీజేపీ అగ్రనాయకత్వం సురేష్‌ వైపు నిలిచింది.

Also Read : బద్వేల్‌ ఉప ఎన్నిక – కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే

జయరాములకు ఆశాభంగం..

బద్వేలు ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే జయరాములు ఆశించారు. 2014లో వైసీపీ తరఫున బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత రెండేళ్లకు టీడీపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో.. బీజేపీలో చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జయరాములకు కేవలం 700 పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జయరాములు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. కనీసం డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేకపోవడంతో తాజాగా జయరాములకు బీజేపీ అభ్యర్థిత్వం దక్కలేదని తెలుస్తోంది. యువకుడు, కొత్త అభ్యర్థిని బరిలోకి దింపడమే మేలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది. ఆ మేరకు కేంద్ర నాయకత్వం సురేష్‌ వైపు మొగ్గింది. సురేష్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా కలిసి వచ్చింది. ఎన్నికల్లో సురేష్‌ ఎలాంటి ఫలితాలు రాబడతారో వేచి చూడాలి.

Also Read : బద్వేల్ బీజీపీ అభ్యర్థిగా సురేష్ పనతాల.. సంఘ్ లెక్కలతో ఫైనల్?