iDreamPost
iDreamPost
ఏలారు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఈ తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు.
బుజ్జి తాత బడేటి వెంకట రామయ్య అప్పట్లోనే BL,ML చదివి ఏలూరు నగరంలో మంచి పేరు సంపాదించారు. స్వాతంత్రపూర్వమే ఏలూరు జమీందార్లయిన “మోతే” కుటుంబాన్ని ఓడించి రెండుసార్లు ఏలూరు మున్సిపల్ చైర్మన్గా గెలిచారు.మోతే నారాయణ రావ్ ను ఎన్నికల్లో ఓడించినా ఆ జమిందార్ కుటుంబానికి చెందిన కేసులను వెంకట రామయ్యే వాదించటం విశేషం. అప్పట్లో రాజకీయ విరోధాలు, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండేవో అర్ధం చేసుకోవచ్చు. బడేటి పేరుతొ ఏలూరు లో ఒక పార్క్,సొంత గ్రామం అత్తిలిలో ఒక గ్రంధాలయం ఏర్పడింది.
బుజ్జి తండ్రి శ్రీ హరి రావ్ కూడా 1980 లో ఏలూరు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. బడేటి రంగారావు కూతురిని SV రంగా రావ్ గారు వివాహం చేసుకున్నారు. SV రంగారావు, బడేటి వెంకట రామయ్య మనవడిగా బుజ్జికి ఏలూరు ప్రాంతంలో మంచి పలుకుబడి ఉండేది. చిన్నతనంలో ఎక్కువ కాలం చెన్నైలో SV రంగారావు ఇంట్లో పెరిగిన బుజ్జి 1995 మున్సిపల్ ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా గెలిచి వైస్ చైర్మన్ అయ్యారు.
1995-2008 మధ్య 10 సంవత్సరాలు ఏలూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన బుజ్జి ప్రజారాజ్యం ఆవిర్భావం తరువాత తన పదవికి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరాడు.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున పోటీచేసి రెండవ స్థానంలో నిలిచాడు. 2014లో టీడీపీ తరుపున గెలిచి ఎమ్మెల్యే కలను నెరవేర్చుకున్నారు. 2014 ఎన్నికల తరువాత చింతమనేని ప్రభాకర్,బడేటి బుజ్జి ఒక జట్టుగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. పందెపు గుర్రాలను పెంచటం బుజ్జికి హాబీ,ఇప్పటికి ఆయనకు కొన్ని పందెపు గుర్రాలు చెన్నైలో ఉన్నాయి.
బుజ్జి సోదరుడు బడేటి వెంకటరామయ్య వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు. ఒలింపిక్స్ లో రిఫరీ గా ,జాతీయ టీమ్ కు మేనేజర్ గా వ్యవహరించారు. కరణం మల్లేశ్వరి కూడా కొద్దికాలం వెంకట్ రామయ్య దగ్గర శిక్షణ పొందారు.
బుజ్జికి ఈ తెల్లవారు జామున గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. SV రంగ రావ్,శ్రీ హరి రావ్,బుజ్జి అందరు కూడా 54-55 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో మరణించటం విచారకరం.