iDreamPost
android-app
ios-app

వర్ల రామయ్య వారసుడికి నియోజకవర్గ బాధ్యతలు

వర్ల రామయ్య  వారసుడికి నియోజకవర్గ బాధ్యతలు

తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని మార్పులకు శ్రీకారం చుడుతుంది అనే ప్రచారం కాస్త ఎక్కువగా జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో పార్టీ కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో కొన్ని కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా పదేపదే కథనాలు రాస్తోంది.చాలా నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహంగా ఉన్నారని వాళ్లను పక్కన పెట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపించాయి.

అయితే ఈ మార్పులు ఇటీవలి కాలంలో కొంతమందిని బాగా ఇబ్బంది పెట్టాయి అనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధానంగా పామర్రు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజాకు చంద్రబాబు నాయుడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం…అదేవిధంగా పుంగునూరు నియోజకవర్గానికి సంబంధించి అనీష రెడ్డి బాధ్యతలను చల్లా ధర్మారెడ్డికి అప్పగించడం. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఈ మార్పులను ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వాళ్లకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు.

2014 ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఉప్పులేటి కల్పన… 2017 లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి పార్టీలో జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు ఆమెకు పామర్రు నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చారు. అయితే టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆమెకు సీటు ఇవ్వడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. 2019 ఎన్నికల్లో ఆమె ఓటమికి రామయ్య సరిగా పనిచేయకపోవడమే అనేది ప్రధానంగా వినిపించింది.

ఇక 2019 ఎన్నికల తర్వాత ఉప్పులేటి కల్పన పార్టీ కోసం పెద్దగా కష్టపడిన పరిస్థితులు కూడా లేవనే చెప్పాలి. పార్టీకి అనుకూలంగా పరిస్థితులను మార్చుకునే విషయంలో అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఉప్పులేటి కల్పన ఘోరంగా విఫలమయ్యారు. పార్టీ స్థానిక నాయకత్వాన్ని కలుపుకుని వెళ్లే విషయంలో అదే విధంగా గ్రామస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసే విషయంలో ఉప్పులేటి కల్పన విఫలమయ్యారు అనే కామెంట్స్ అప్పట్లో వినిపించాయి.

దానికి తోడు ఉప్పులేటి కల్పన విషయంలో టీడీపీ నేతలు పదేపదే ఫిర్యాదులు చేయడం రామయ్య తన కుమారుడిని నియోజకవర్గానికి… పరిచయం చేయాలని పట్టుబట్టడంతో చంద్రబాబునాయుడు మరో మార్గం లేక ఉప్పులేటి కల్పన ను పక్కన పెట్టారు. పుంగునూరు నియోజకవర్గానికి సంబంధించి అనీష రెడ్డి విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది. నియోజకవర్గంలో పార్టీకి అనుకూల పరిస్థితులు లేకపోవడం అదేవిధంగా స్థానిక నాయకత్వం కలిసి రాక పోవడం, దానికితోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూకుడుగా ఉండటంతో… ఆమెను పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఏది ఎలా ఉన్నా సరే తనను నమ్మి వచ్చిన వాళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారననే ఆవేదన ఇప్పుడు కొంత మంది పార్టీ నాయకులలో వ్యక్తమవుతోంది.