Idream media
Idream media
ఐసీసీ టీ20 మహిళా ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌తో టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్ బరిలో దిగనుంది.గురువారం సిడ్నీలో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. కంగారూ ఓపెనర్లు మూనీ (28),అలీసా హీలి (18) జట్టుకు చక్కని ఆరంభాన్ని అందించారు.తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించి వీరిద్దరూ వెనుదిరిగాక లానింగ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించింది. చివర్లో హేన్స్ (17) సత్తాచాటింది.కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (49 బంతులలో 4 ఫోర్లు,ఒక సిక్సర్‌తో అజేయంగా 49 పరుగులు చేసి సత్తాచాటింది. సఫారీ బౌలర్లలో నికెర్క్‌కు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం ఆటకు వర్షం వలన అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులుగా నిర్ణయించారు.లక్ష్యఛేదనలో ఒత్తిడికి గురైన సౌతాఫ్రికా టాపార్డర్ వైఫల్యంతో 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు.ఈ దశలో లూస్ (21)తో కలిసి వోల్వర్ట్ జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 57 పరుగులు జోడించారు.అయితే లూస్ అవుట్ అయ్యాక ఒక ఎండ్‌లో వోల్వర్డ్ నిలకడగా ఆడుతున్నప్పటికీ ఆమెకు సహకరించే ప్రొటీస్ బ్యాటర్లు కరువయ్యారు.లారా వోల్వర్ట్ 27 బంతులలో 3 ఫోర్లు,2 సిక్సర్‌తో అజేయంగా 41 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేసింది.కానీ నిర్ణీత 13 ఓవర్లలో సౌతాఫ్రికా 92 పరుగులకే పరిమితం కావడంతో ఐదు పరుగులతో ఆసీస్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగన్ షూట్‌కు రెండు వికెట్లు దక్కాయి.
తొలిసారి మహిళా టి20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా:
అంతకుముందు ఈరోజు ఉదయం సిడ్నీ వేదికలోనే భారత్,ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ కనీసం టాస్ కూడా వేయకుండానే వర్షార్పణం అయ్యింది. గ్రూప్ -ఏలో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిన భారత్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.దీంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న భారత్ జట్టుని విజేతగా ప్రకటించడంతో తొలిసారి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని 17 పరుగుల తేడాతో సునాయాసంగా ఓడించిన టీమిండియా ఉమెన్స్ జట్టు ఫైనల్ సమరంలో ఆసీస్ ఉమెన్స్ జట్టుతో తలపడుతుండటం విశేషం.తుదిపోరు ఆదివారం మార్చి 8వ తేదీన మెల్‌బోర్న్ వేదికపై జరగనుంది.