iDreamPost
android-app
ios-app

96 సంవత్సరాల చెత్త రికార్డు సమం చేసిన భారత్

96 సంవత్సరాల చెత్త రికార్డు సమం చేసిన భారత్

అడిలైడ్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టులో మూడవ రోజు మొదలయ్యే సమయానికి భారతజట్టు పటిష్టంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో లభించిన 53 పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో మరో తొమ్మిది పరుగులు జోడించి ఒక వికెట్ కోల్పోయింది. దీంతో భారతజట్టు స్కోరు 62/1 అన్నట్టు ఉంది. తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి. మరో 150 పరుగులు చేయగలిగితే నాలుగో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు మ్యాచ్ గెలిపిస్తారనుకున్న అభిమానుల ఆశలమీద నీళ్ళు చల్లుతూ ఆస్ట్రేలియా బౌలర్లు జోష్ హేజిల్ వుడ్, ప్యాట్ కమ్మిన్స్ ధాటికి ఒకరొకరుగా పెవిలియన్ దారి పట్టారు.

దీనితో కంగారు పడిన భారత అభిమానులు జట్టు స్కోరు 25 దాటగానే ఊపిరి పీల్చుకున్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ స్కోరు అది. 1955లో ఆక్లాండులో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఆ స్కోరు నమోదు చేసింది. దాని తర్వాత 30 నుంచి 36 పరుగుల వరకూ సౌతాఫ్రికా జట్టు నాలుగు సార్లు (30,30,35, 36) ఆస్ట్రేలియా జట్టు ఒకసారి (36) తక్కువ స్కోర్లు నమోదు చేశాయి. వీటిని దాటుకుంటూ భారత జట్టు ముందుకు పోతూ ఉంటే భారత జట్టు తరఫున 1974లో ఇంగ్లాండు మీద నమోదైన తమ అత్యల్ప స్కోరు 42/9 కూడా దాటుతుంది అనుకుంటే, జట్టు స్కోరు 36 పరుగులు ఉన్నప్పుడు చేతికి దెబ్బ తగిలిందని షమి బ్యాటింగ్ కొనసాగించడానికి ఇష్టపడకపోవడంతో 36/9 వద్ద భారత జట్టు తన ఇన్నింగ్స్ ముగించి, భారతజట్టు తరఫున టెస్టుల్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది.

రెండకెల స్కోరు ఒకటైనా లేదు

టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ స్కోరు అయిన 25 లో కూడా ఒక న్యూజిలాండ్ ఓపెనర్ 11 పరుగులు చేశాడు. భారత జట్టు అత్యల్ప స్కోరు 42/9 (ఈ ఇన్నింగ్స్ లో గాయం కారణంగా చంద్రశేఖర్ బ్యాటింగ్ చేయలేదు) చేసినప్పుడు కూడా అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైనా ఏక్ నాథ్ సోల్కర్ 18 పరుగులు సాధించాడు. అలాగే సౌతాఫ్రికా నాలుగు సార్లు, ఆస్ట్రేలియా ఒకసారి 30 నుంచి 40 పరుగుల మధ్య ఆలౌట్ అయినప్పుడు కనీసం ఒక బ్యాట్సుమన్ అయినా రెండకెల స్కోరు నమోదు చేశారు.

ఇన్నింగ్స్ మొత్తంలో పదకొండు మంది బ్యాట్స్ మెన్ ఒకరు కూడా రెండకెలు చేరుకోలేకపోవడం టెస్టు క్రికెట్ చరిత్రలో గతంలో ఒకసారి మాత్రమే జరిగింది. 1924లో ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఇంగ్లాండుతో జరిగిన టెస్టు మ్యాచ్ లో సౌతాఫ్రికా నమోదు చేసింది. ఫాలోఆన్ ఆడుతూ 30 పరుగులకే ఆలౌట్ అయిన ఆ సౌతాఫ్రికా ఇన్నింగ్స్ లో 11 ఎక్స్ట్రా లు ఉన్నాయి. అయితే అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఆటగాళ్లు ఎవరూ రెండకెల స్కోరు చేరుకోలేకపోగా, ఆస్ట్రేలియా బౌలర్లు ఒక ఎక్స్ట్రా పరుగు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ఒక టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్ లో ఒకరు కూడా రెండకెల స్కోరు చేరుకోలేకపోయిన 96 సంవత్సరాల సౌతాఫ్రికా రికార్డును ఇంతకాలం తర్వాత భారత జట్టు సమం చేసింది.