iDreamPost
iDreamPost
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేడే(జూన్ 23) జరగనుంది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గానికి నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆల్రెడీ ఇవాళ ఉదయం ఉదయం 7గంటల నుండే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఉప ఎన్నిక బరిలో 14మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసుతో సహా మరో 11మంది పోటీలో ఉన్నారు. అయితే పోటీ వైఎస్ఆర్ సీపీ బీజేపీ మధ్యే సాగనుంది.
ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,400 మంది ఓటర్లు ఉండగా వీరంతా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అధికారులు 279 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 363 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, 391 వీవీ ప్యాట్స్ ను పంపిణీ చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో మొత్తం 1,409 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ నేపథ్యంలో మూడు మిలిటరీ బెటాలియన్లు, ఆరు పోలీస్ స్పెషల్ ఫోర్స్ టీమ్, ముగ్గురు డీఎస్పీలు, 18మంది సీఐలు, 36మంది ఎస్ఐలు,900 మంది స్థానిక పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం దాదాపు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల పర్యవేక్షణకు సిద్ధం చేశారు. ఇక ఈ ఉప ఎన్నిక ఫలితాలు జూన్ 26న వెల్లడించనున్నారు.