iDreamPost
android-app
ios-app

గద్వాల్‌ హైవేపై హైడ్రామా.. రూ.750 కోట్ల నగదుతో ట్రక్కు

  • Published Oct 19, 2023 | 3:07 PMUpdated Oct 19, 2023 | 3:07 PM
  • Published Oct 19, 2023 | 3:07 PMUpdated Oct 19, 2023 | 3:07 PM
గద్వాల్‌ హైవేపై హైడ్రామా.. రూ.750 కోట్ల నగదుతో ట్రక్కు

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. ఈ ఏడాది నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు చేసే ప్రయత్నాలకు చెక్‌ పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానాస్పద రీతిలో తరలిస్తున్న నగదు, మద్యం, బంగారం, వెండి సీజ్‌ చేస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన 10 రోజుల్లోనే పోలీసులు.. 165 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం, వెండిని సీజ్‌ చేశారు. ఇక నేడు రెండు కోట్ల రూపాయల విలువైన పట్టు చీరలు, 13 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఈ క్రమంలో మరో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. గద్వాల్‌ హైవే మీద ఏకంగా 750 కోట్ల రూపాయల నగదు ఉన్న ట్రక్‌ను గుర్తించారు పోలీసులు. ఆ వివరాలు..

ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గద్వాల్ వద్ద జాతీయ రహదారి (ఎన్‌హెచ్) ఓ సాధారణ ట్రక్కులో రూ. 750 కోట్ల నగదును తరలించడంతో కలకలం రేగింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు ఒకేసారి ఇంత భారీ నగదును చూసి ఉలిక్కిపడ్డారు. వాస్తవానికి స్మగ్లర్లకు గద్వాల్ జాతీయ రహదారిని అనుకూలంగా ఉంటుంది. అందుకు అనుకూలంగానే.. ఇదే ప్రాంతంలో భారీ ఎత్తున నగదు ఉన్న ట్రక్‌ను గుర్తించడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అయితే ఈ మొత్తాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు తొలుత అనుమానించారు. కానీ, చివరకు ఆ నగదు యూనియన్ బ్యాంకుకు చెందిందని విచారణలో తేలింది. యూబీఐకి చెందిన నగదును కేరళ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తర్వాత విచారణలో తెలిసింది. దాంతో అనుమానాలకు చెక్‌ పడింది. ఈ అంశంపై తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ స్పందించారు. బ్యాంక్ అధికారులు నుంచి స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత ట్రక్కును వదిలిపెట్టినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘గద్వాల్‌ హైవే మీద రూ. 750 కోట్ల నగదు ఉన్న ట్రక్ని గుర్తించడంతో.. కొన్ని గంటలపాటు ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. మా సిబ్బంది సహాయం కోసం గద్వాల్ పోలీసులకు కాల్ చేశారు. ఆ తర్వాత పత్రాలను పరిశీలించి.. బ్యాంక్, ఆర్బీఐను సంప్రదించాం. అనంతరం గద్వాల్ పోలీసుల సాయంతో ట్రక్కు హైదరాబాద్‌కు ప్రయాణించింది’’ అని తెలిపారు. రాష్ట్రంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు పటిష్టంగా తనిఖీ చేస్తున్నాయని ఈ సందర్భంగా సీఈవో పేర్కొన్నారు.

ఎన్నికల నోటిషికేషన్‌ విడుదలైన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం విలువ రూ.165 కోట్లకు చేరింది. ఇలా సీజ్‌ చేసిన వాటిల్లో.. బంగారం, వజ్రాలు, విలువైన లోహాల విలువ రూ.62 కోట్లు కాగా.. నగదు రూ.77 కోట్లు అని పోలీసులు తెలిపారు. రానున్న రోజుల్లో తనిఖీలను మరింత పెంచుతామన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి