iDreamPost
iDreamPost
దశాబ్దాలు గడుస్తున్నా పరిశ్రమను పట్టి పీడిస్తున్న అతి పెద్ద భూతం పైరసీ. ఒకప్పుడు వీడియో క్యాసెట్లతో మొదలయ్యింది. తర్వాత విసిడి డివిడిలకు పాకింది. పెన్ డ్రైవ్ లు వీటికి వారధిగా మారాయి. టెక్నాలజీ పెరిగాక వెబ్ సైట్లు, టొరెంట్లు, యాపులు, టెలిగ్రాములు ఇలా రకరకాలుగా ఇది విస్తరిస్తూనే ఉంది తప్ప అంతం కావడం లేదు. ప్రభుత్వాలు మారినా ఇండస్ట్రీ పెద్దలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా వీటిని కట్టడి చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది రిలీజ్ కు ముందే ఇంటర్వెల్ దాకా హెచ్డి బయటికి వచ్చి ఎంత రచ్చ జరిగిందో ఫ్యాన్స్ అంత ఈజీగా మారిపోలేరు. విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఏకంగా ఫుల్ వెర్షన్ వచ్చేసిన ఉదంతం ఉంది.
ఇక థియేటర్లలో రిలీజయ్యాక వీటి బారిన పడని ఏ సినిమా లేదు. అంతగా పాతుకుపోయిన ఈ పైరసీ పేరు చెప్పగానే వీటికి అలవాటు పడిన వాళ్లకు వెంటనే గుర్తొచ్చే పేరు తమిళ్ రాకర్స్. వీళ్ళు ఎక్కడ ఉంటారో, రిలీజ్ రోజే సాయంత్రం లోపు వాళ్ళ సైట్ లో కొత్త సినిమాలు ఎలా అప్లోడ్ చేస్తారో ఎవరికీ తెలియని బ్రహ్మ రహస్యం. సూర్య వీడొక్కడేలో ఈ తతంగాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ బయట ఇది అంతకంటే పెద్ద లెవల్ లో జరుగుతుంది. ఎన్ని వార్నింగులు వచ్చినా వాళ్ళు బెదరరు. అసలు ఆ సైట్ ఓనర్ ఎవరో, ఏ దేశం నుంచి ఆపరేట్ చేస్తున్నారో కూడా ఇప్పటిదాకా బయట పడలేదు. అంతగొప్పగా సాంకేతిక వాడుతున్నారు.
ఇప్పుడు ఏకంగా తమిళ రాకర్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఏనుగు హీరో, సాహో విలన్ అరుణ్ విజయ్ నటించిన ఈ థ్రిల్లర్ లో పైరసీ తాలూకు మూలలను, అది వ్యవస్థను ఎంతగా ప్రభావితం చేసిందో చూపించబోతున్నారు. టీజర్ కూడా వచ్చేసింది. ఇందులో ఈ రాకెట్ ఆపరేషన్ జరిగే విధానంతో పాటు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉంటాయట. మొత్తానికి డిఫరెంట్ కాన్సెప్టే ఎంచుకున్నారు. త్వరలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇదంతా బాగానే ఉంది ఇప్పుడీ వెబ్ సిరీస్ ని తమిళ్ రాకర్స్ వదలకుండా పైరసీ అదే సైట్ లో పెడతారా లేక తమ పేరునే టైటిల్ గా వాడారని వదిలేస్తారా సినిమా వచ్చాక చూద్దాం.