Idream media
Idream media
వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఉచితంగా వైద్యం అందించేలా రూపొందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఈ పథకం కింద మొదట పశ్చిమగోదావరి జిల్లాలో 2059 ప్రాసీజర్స్‌కు వైద్యం అందిస్తారు. లోపాలను సవరించుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో తమ ప్రభుత్వం తీసుకురాబోయే విప్లవాత్మక కార్యక్రమాలను సీఎం ప్రకటించారు. నాడు నేడు కార్యక్రమాన్ని ఆస్పత్రులకు అవలంభిస్తామని తెలిపారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేస్తామన్నారు. 104, 108 కొత్త వాహనాలు మార్చి నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో వాహనం వస్తుందని భరోసా ఇచ్చారు.
వైఎస్సార్‌కంటి వెలుగు పథకం కొనసాగుతుందన్నారు. 66 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు చేసి లక్షన్నర కళ్ల అద్దాలు ఇచ్చామని చెప్పారు. వేసవిలో వృద్ధులకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో 510 రకాల మందులను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు.
అన్ని ప్రాంతాలు బాగుండాలి. అందరూ బాగుండలన్న లక్ష్యంతో పరిపాలన జరుగుతుందన్నారు. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర పరిపాలన రెండూ సమానమేనన్నారు. తాగు, సాగు నీరు అందరికీ సమానంగా అందాలన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తప్పక సరిచేస్తామని స్పష్టం చేశారు.