కరోనా తరువాత ప్రజల ఆలోచనల్లో మార్పులొచ్చాయి. వ్యక్తిగత, అత్యవసర పరిస్థితుల్లో ఒకరిపై ఆధారపడుకండా తమకంటూ సొంత కారు ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. అయితే, కరోనాతో మరో మార్పు కూడా వచ్చింది. అదే మన ఆరోగ్యం, చుట్టూ పర్యావరణంపై కాస్త శ్రద్ధ పెరిగింది. అందుకే మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఎలక్ట్రిక్ కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక పెరుగుతున్న పెట్రోల్ రేట్లు కూడా ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి పెరిగేందుకు మరో కారణంగా చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. ప్రభుత్వాలు కూడా ఎకో ఫ్రెండ్లీ వాహనాలకు రాయతీలు కల్పిస్తుండటం కలిసొస్తున్న అంశం. మరోవైపు బ్యాంకులు సైతం ఎలక్ట్రిక్ వాహనాలకు తక్కువ రేటుకే లోన్లు అందిస్తున్నాయి. మరి ఎలక్ట్రిక్ కారు కొనే సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటి? చూద్దారం రండి.
ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనేముందు ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేట్లు అందిస్తోందో ముందుగానే పరిశీలించండి. ఫలానా బ్యాంకు ద్వారా లోన్ పొందిన తరువాత మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఈ పరిశీలన ఉపయోగపడుతుంది.
వాహనాల కంపెనీలు ఇచ్చే ఆఫర్లతో పాటుగా ప్రభుత్వం సైతం అందిస్తున్న రాయితీలను ముందుగానే తెలుసుకోండి. ఈ తరహా వాహనాలకు రెజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు పన్నులు తక్కువగా ఉంటాయి. ఇలా విభిన్న మార్గాలను అన్వేషించడం ద్వారా ఎక్కువ డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది.
మీరు ఏ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంపిక చేసుకున్నారనేది కూడా ముఖ్యమైన అంశమే. వాహనం తాలూకు టెక్నాలజీ, మైలేజీ, ఛార్జింగ్ కు పట్టే సమయం వంటి అంశాలు ఆ వాహనం కొనేముందే కచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఎలాంటి ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తారు?మీ బడ్జెట్ ఎంత? అనే అంశాలను బేరీజు వేసుకున్నాకే వాహనాన్ని ఎంపిక చేసుకోండి. వాహనం కొన్నాక వేరే వాటితో పోలికే తెచ్చేకంటే, ముందే పలు రకాల ఎలక్ట్రిక్ కార్లపై కనీస పరిశోధన చేయడం ద్వారా డబ్బుతో పాటు మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా పొందుతారు.
ఎలక్ట్రిక్ కారు కొనేముందు కంపెనీకి డౌన్ పేమెంట్ ఎంత చేయాలి? వాహనం కొన్నతరువాత దాని నిర్వహణ ఖర్చులు ఎలా ఉంటాయి? అనే విషయాల్ని ముందుగానే తెలుసుకోండి. వీటి గరించి తెలుసుకోకుండా వాహనం కొంటే, మీరు భవిష్యత్తులో ఈఎంఐలు, వాహనం మెయింటెనెన్స్ కు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పక్కా ప్రణాళికతో కారు కొంటే ఏ చింతా లేకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించగలరు.
చివరగా, మీరు ఏ కారు తీసుకున్నా.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అనే అంశాన్ని మాత్రం మర్చిపోకండి.