iDreamPost
iDreamPost
తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి మాత్రమే సినిమాలు తీసి జనంలో చైతన్యం రప్పించే లక్ష్యంతో పని చేసే అరుదైన దర్శకుల్లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ముందు వరసలో ఉంటారు. సైడ్ క్యారెక్టర్స్ తో కెరీర్ మొదలుపెట్టి చిన్నా చితకా పాత్రలు చేస్తూ గురువు దాసరి నారాయణరావు అడుగుజాడల్లో నడుస్తూ ఈ స్థాయికి చేరడానికి ఆయన చేసిన పోరాటం చిన్నది కాదు. అందులో మొదటి అడుగే డైరెక్టర్ కం హీరో కం ప్రొడ్యూసర్ గా తెరంగేట్రం చేసిన అర్ధరాత్రి స్వతంత్రం. 1984వ సంవత్సరం. చిన్న వేషాలతో తనలో నటుడిని సంతృప్తి పరచలేకపోతున్న నారాయణమూర్తి ఎలాగైనా స్వంతంగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. పెట్టుబడి కోసం ఆ రోజుల్లోనే క్రౌడ్ ఫండింగ్ చేశారు.
కాకపోతే బడ్జెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినవాళ్లంతా ఆయన ప్రాణస్నేహితులే. ఆలస్యం చేయకుండా స్నేహచిత్ర బ్యానర్ స్థాపించారు. రిస్క్ అనిపించినా సరే లెక్కచేయకుండా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేసుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణ, నటులు ప్రభాకర్ రెడ్డి సహాయంతో పద్మాలయ వ్యవహారాలు చూసుకునే ఆదిశేషగిరిరావుకి స్క్రిప్ట్ వినిపించారు. ఆయన విని మెచ్చుకున్నారు. కానీ హీరో నారాయణమూర్తే అనేసరికి వెనకడుగు వేశారు. దానివల్ల నిరాశపడలేదు. సంభాషణలు ప్రత్యేకంగా పీఎల్ నారాయణతో రాయించారు. ప్రముఖ దర్శకుడు టి కృష్ణ(హీరో గోపీచంద్ తండ్రి) మొత్తం చదివి శెభాష్ అని మెచ్చుకుని ఓ చిన్న వేషం కూడా వేస్తానన్నారు. సత్యం సంగీతంలో వంగపండు ప్రసాదరావుతో మొత్తం పాటలు రాయించారు. ప్రభాకర్ రెడ్డి, రాళ్ళపల్లి, నర్రా వెంకటేశ్వరావు, పురాణం సూర్య, మల్లికార్జునరావు, వరలక్ష్మి, అత్తిలి లక్ష్మి ఇలా మంచి క్యాస్టింగ్ సెట్ అయ్యింది.
ఎన్నో లొకేషన్లలో, అడవుల్లో ఆపసోపాలు పడుతూ షూటింగ్ పూర్తి చేశారు. తీరా ఫస్ట్ కాపీ అయ్యాక సెన్సార్ వాళ్ళతో చిక్కు వచ్చింది. పీపుల్స్ వార్ ఉద్యమాన్ని ప్రోత్సహించేలా ఉందని సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ముంబై రివైజింగ్ కమిటీకి రెఫర్ చేశారు. అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్లంతా మెచ్చుకున్నారు. రెండేళ్ల కష్టాలకు చెక్ పెడుతూ అర్ధరాత్రి స్వతంత్రం 1986లో నవంబర్ 6న విడుదలయ్యింది. మొదటి ఆట నుంచే బ్రహ్మాండమైన రెస్పాన్స్. హౌస్ ఫుల్ కలెక్షన్లు. అప్పటి డిజిపి ఈ సినిమా వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని నిషేధించడానికి ప్రతిపాదన పెట్టారు. కానీ ఇండస్ట్రీ పెద్దలు నారాయణమూర్తికి అండగా నిలబడ్డారు. చాలా థియేటర్ల దగ్గర పోలీస్ సెక్యూరిటీ పెట్టాల్సి వచ్చింది. రూపాయకు మూడు రూపాయలు లాభం వచ్చింది. తనను నమ్మి డబ్బులిచ్చిన ప్రతిఒక్కరికి వడ్డీతో సహా తిరిగి చెల్లించారు నారాయణమూర్తి. అప్పటినుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆయనకు సిద్ధాంతాన్ని మార్చుకునే అవసరం కానీ, వెనుదిరిగి చూడాల్సిన అవసరం కానీ పడలేదు. అంత బలమైన పునాది వేసింది అర్ధరాత్రి స్వతంత్రం.