Idream media
Idream media
‘‘సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు పోతాం’’ పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. గతంలో ఆయన ఈ మాట చెప్పినప్పుడల్లా ఏదో చెబుతున్నాడులే అనుకున్నారు. కానీ చంద్రబాబు చెప్పిన మాట అక్షర సత్యమని ఈ రోజు రుజువైంది. సంక్షోభాలను చంద్రబాబు తన రాజకీయానికి అవకాశాలుగా ఎలా మలుచుకుంటారో ఆయన్ను గమనించే వారికి ఈ రోజు బోధపడింది.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. ఈ పరిణామాలు చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయని ఇటీవల ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిక వచ్చాక.. ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభం అనంతరం చంద్రబాబు నాయకత్వంపై అటు ప్రజలతోపాటు, ఇటు ఆ పార్టీ నేతల్లోనూ విశ్వాసం సన్నగిల్లిందన్న విషయం వాస్తవం.
చంద్రబాబు, టీడీపీ పరిస్థితి ఇలాంటి దుస్థితిలో ఉన్న సమయంలో ఈ రోజు అచ్చెం నాయుడు అరెస్ట్ వ్యవహారం సంక్షోభంలో ఉన్న చంద్రబాబుకు ఓ మంచి అవకాశంగా దొరికినట్లైంది. ఈ అవకాశాన్ని ఏ మాత్రం చేజార్చుకోదలుచుకోలేదని ఈ రోజు చంద్రబాబు ప్రవర్తించిన తీరును బట్టి అర్థం అవుతోంది. వచ్చిన అవకాశాన్ని ఓడిసిపట్టుకున్న చంద్రబాబు.. ఉదయం నుంచి నానా యాగీ చేయడం మొదలుపెట్టారు. ట్వీట్లు, మీడియా ప్రకటనలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉన్న క్యాడర్‌ను తట్టిలేపుతున్నారు.
ఓటమి తర్వాత ఏడాది కాలంగా సైలెంట్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, గోడ దూకేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేతలు.. అచ్చెం నాయుడు అరెస్ట్‌తో బయటకు వచ్చి ప్రెస్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. అచ్చెం నాయుడు అరెస్ట్‌పై స్పందించడం చంద్రబాబుకు పెద్ద ఊరటనిచ్చే విషయం. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. గంటా శ్రీనివాస రావు వంటి నేతలు పార్టీ వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరూ వెలుగులోకి రావడం అచ్చెం నాయుడు అరెస్ట్ వల్లే జరిగిందనడంలో సందేహం లేదు.
పార్టీ నేతల్లో కదలికతోపాటు చంద్రబాబుకు మరో ఛాన్స్ దొరికింది. పార్టీకి వెన్నుముక లాంటి బీసీలు దూరం అయ్యారని చంద్రబాబు ఇటీవల మహానాడులో కూడా వాపోయారు. మళ్లీ వారిని దగ్గరకు చేర్చుకునేలా పని చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అచ్చెం నాయుడు అరెస్ట్‌ను చంద్రబాబు బీసీలను మళ్లీ ఆకట్టుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆయన ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అచ్చెం నాయుడు అరెస్ట్ బలహీన వర్గాలపై దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. ఆయన బాటలో ఆ పార్టీ నేతలు అనుచరిస్తూ.. బీసీలపై ప్రభుత్వం దాడి చేస్తోందంటూ వల్లెవేయడం ప్రారంభించారు. రాజకీయంగా ఎదుగుతున్న బీసీలను అణగదొక్కుతున్నారని తమదైన శైలిలో చెప్పుకొస్తూ బీసీలను ఆకర్షించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
చంద్రబాబు అండ్ కో కంఠశోష తప్ప.. రాజకీయ చైతన్యం కలిగిన ఏపీ ప్రజలు వీరి మాటలను ఎంత మేరకు విశ్వసిస్తారనేది సందేహమే. పైగా వీరి భాగోతాలను సోషల్ మీడియా ఎండగడుతూనే ఉంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కితే చాలు అనే సామెతగా అచ్చెం నాయుడు అరెస్ట్‌తో పార్టీతో అంటీముట్టనట్లుగా ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు స్పందించడం టీడీపీకి లాభమనే చెప్పుకోవాలి.