Idream media
Idream media
వృత్తి వేరు.. ప్రవృత్తి వేరు. ఎంత బిజీ జీవితమైనా ప్రతి ఒక్కరికీ అభిరుచులు, కొన్నింటిపై ఆసక్తి ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ. నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమవుతూనే నటనపై ఉన్న ఆసక్తి మేరకు సినిమాలో ఓ పాత్ర పోషిస్తున్నారు. అది కూడా ప్రభుత్వం తలపెట్టిన ఓ బృహత్తర కార్యక్రమానికి సంబంధించినదే. ఆయన గతంలో మాస్టారుగా, పోస్ట్ మాాస్టర్ గా విధులు నిర్వర్తించారు. అలాగే పోలీస్ శాఖలోనూ, బ్యాంకులోనూ పనిచేశారు. ఆ తరువాత కాలంలో రాజకీయాల్లో రంగ ప్రవేశంచేసి ప్రజలకు ప్రత్యక్ష సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఓ సినిమాలో ప్రధానోపాధ్యాయుడిగా మారారు.
ప్రస్తుతం అరకు ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి ఫల్గుణకు ఓ అవకాశం వచ్చింది. అది కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం పేరుతో రూపొందిస్తున్న చిత్రం. పాత్ర కూడా ప్రధానోపాధ్యాయుడు..! అప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అనుభవంతో పాటు.. ఇప్పుడు చదువుకోలేని పేద పిల్లలకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పేరుతో చిత్రం కూడా కలిసిరావడంతో ఇక ఎమ్మెల్యే ఫల్గుణ వెనుదిరిగి చూడలేదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ అమ్మఒడి చిత్రానికి డైరెక్టర్‌గా దత్తాత్రేయ వ్యవహరిస్తున్నారు. అయితే.. అమ్మఒడి పేరుతో రెండు గంటల సినిమా షూటింగ్ నిర్మిస్తున్నామని గతంలో ఎమ్మెల్యేకు చిత్రయూనిట్ చెప్పింది. దీంతో.. అవకాశముంటే అందులో తనకు కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరడంతో.. చిత్ర యూనిట్ ఆ మేరకు చెట్టి ఫల్గుణను ఆహ్వానించారు. తమ చిత్రంలో నటించాల్సిందిగా కోరారు. అందుకోసం ప్రధానోపాధ్యాయుడి పాత్రను ఎమ్మెల్యేకు కేటాయించారు.
అమ్మఒడి చిత్రం షూటింగ్ పాడేరు మండలం దిగుమోదపుట్టు గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. స్కూలు పిల్లలు పాఠశాలకు వస్తున్నప్పుడు హెడ్‌మాస్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సన్నివేశం షూట్ చేశారు. దీంతో పాటు తరగతిగదిలో లెక్కలు బోధిస్తున్నట్టు మరో సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రధానోపాధ్యాయుడి పాత్రలో చెట్టి ఫల్గుణ తన పాత్రకు జీవం పోసినట్టు నటిస్తూ… కనిపించారు. తనకు చిత్రంలో ప్రధానోపాధ్యాయుడిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. కాగా ఇటీవల చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ముని పాత్రలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గోన్నారు. ప్రభుత్వానికి చెందిన కార్యక్రమంలోనే ఇలా నటించే అవకాశం రావడంపై ఫల్గుణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.